'రుషికొండ ప్యాలెస్' పై కీలక నిర్ణయం.. ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ

విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన ‘రుషికొండ ప్యాలెస్’ వినియోగంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2026-04-07 07:10 GMT

విశాఖపట్నంలో గత ప్రభుత్వం నిర్మించిన ‘రుషికొండ ప్యాలెస్’ వినియోగంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండపై నిర్మాణాలను వినియోగంలోకి తెచ్చే విషయమై అధ్యయనానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశం మంగళవారం జరిగింది. గత నాలుగు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మరోసారి చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రుషికొండ ప్యాలెస్ ను ఆదాయ వనరుగా మార్చాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా భవనాల సందర్శనకు ప్రజలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

రుషికొండ భవనాల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం 5వ భేటీ మంగళవారం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప సంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వర్చువల్ గా హాజరయ్యారు. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో పర్యాటక భవనాలను కూల్చేసి రూ.450 కోట్లతో రుషికొండపై మూడు భవనాలను నిర్మించారని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసమే నెలకు రూ. 25 లక్షల ప్రజా ధనం వృధా అవుతోందని మంత్రి దుర్గేష్ తెలిపారు.

దీంతో భవనాలను ఉపయోగంలోకి తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించినట్లు మంత్రి వివరించారు. ప్రజల సందర్శనకు అనుమతించడంతోపాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయని, ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు భూమి ఉందని, మొత్తంగా 4,800 చదరపు మీటర్ల భూమిని వినియోగంలోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భవనాల నిర్వహణకు తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఈ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించే అవకాశంపైనా కమిటీ చర్చించినట్ల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కాగా, మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయంతో రుషికొండ భవనాలను ఇకపై ప్రజల సందర్శనకు అనుమతించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వంలో అత్యంత విలాసవంతంగా ఈ భవనాలను నిర్మించారు. భవన నిర్మాణ సమయంలోనూ, ఆ తర్వాత కూడా భవనాల సందర్శనకు ఎవరినీ అనుమతించలేదు. అత్యంత రహస్యంగా చుట్టూ పరదాలు కట్టి నిర్మించడం, ఆ భవనాలను ఏ అవసరం కోసం నిర్మిస్తున్నామో అప్పటి ప్రభుత్వం, అధికారులు చెప్పకపోవడంతో పెద్ద రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి.

Tags:    

Similar News