రాహుల్ వెనుక ‘తెలుగోడు’

Update: 2015-09-27 13:30 GMT
కొన్ని పరిచయాలు ఎక్కడో మొదలై మరెక్కడి వరకో వెళుతుంటాయి. రాజకీయాల్లో నమ్మకం ఒకసారి కానీ కుదిరితే ఇక.. అలా దూసుకెళ్లటమే. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసే కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ వారసుడు రాహుల్ గాంధీ తనకు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

తన రాజకీయ కార్యదర్శిగా ఆయన తెలుగు వ్యక్తిని నియమించుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రాంతాలకు చెందిన వారికి సుపరిచితమైన కొప్పుల రాజును తన రాజకీయ కార్యదర్శిగా నియమించుకోనున్నట్లు చెబుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రా క్యాడర్ కింద చేస్తూ.. కేంద్రానికి వెళ్లి..అక్కడ రాహుల్ కంట్లో పడిన ఆయన.. తన పదవికి రాజీనామా చేసేసి కాంగ్రెస్ లో చేరిపోవటం తెలిసిందే.

అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు.. దేశ దశ..దిశను మార్చే కార్యక్రమాల రూపకల్పన విషయంలో కొప్పుల రాజు విపరీతమైన పట్టుంది. ఇప్పటికే తన విధేయతతో పాటు.. తన తెలివితేటలతో రాహుల్ మనసు దోచుకున్న ఆయనకు భారీ ప్రమోషన్ లభించనుందని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ.. ఎస్టీ సెల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కొప్పుల రాజును.. తాజాగా తన కార్యదర్శిగా నియమించుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజాయితీ కలిగిన అధికారిగా.. వినూత్నమైన ప్రజాహిత కార్యక్రమాల రూపశిల్పిగా తెలుగు నేతలందరికి తెలిసిన కొప్పుల రాజు.. రానున్న రోజుల్లో మరింత శక్తివంతం కావటం ఖాయమని చెబుతున్నారు. రాహుల్ గాంధీకి కార్యదర్శి కావటమంటే.. కొప్పుల రాజు రేంజ్ ఓ స్థాయికి వెళ్లినట్లుగా చెప్పొచ్చు.
Tags:    

Similar News