ఇండిగో సంక్షోభం కంటిన్యూ.. మరో 400 విమానాలు రద్దు
ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మరో 400 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.;
ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈరోజు మరో 400 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. అందులో ఢిల్లీలో 134 విమానాలు.. బెంగళూరులో 127, హైదరాబాద్ లో 112, చెన్నైలో 71, అహ్మాదాబాద్ తోపాటు ముంబై , కోల్ కతా, విశాఖపట్నంలో పలు విమానాలు రద్దు అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తాజా సమాచారం కోసం విమానయాన సంస్థలను నేరుగా సంప్రదించాలని ఎయిర్ పోర్ట్ ప్రయాణికులను కోరుతున్నాయి. మార్పులపై అలెర్ట్ గా ఉండాలని.. విమానాశ్రయాలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఇండిగో విమానాలు వందలాది రద్దవడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
భారీ స్థాయిలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడటంపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ సమస్యపై డీజీసీఏ ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవలి రద్దుల వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయని రెగ్యులేటర్ పేర్కొంది. ప్రత్యామ్మాయ ఏర్పాట్లు లేకపోవడం.. అవసరమైన సమయంలో ఎయిర్ లైన్స్ మద్దతు అందించడంలో విఫలం కావడంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండిగోపై ఎందుకు చర్య తీసుకోకూడదో ఇప్పటికే 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పీటర్ ఎల్బర్స్ ను డీజీసీఏ ఆదేశించింది.
ఈ సంక్షోభానికి కారణం ఏంటి?
ఈ సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ పథకంలో చేసిన మార్పులకు ఇండిగో తగినట్లుగా సిద్ధం కాకపోవడమే.. ఇతర విమానయాన సంస్థలు ఈ కొత్త నిబంధనలకు సులభంగా అనుగుణంగా మారగా.. ఇండిగో మాత్రం సిబ్బంది షెడ్యూల్ లు, విమానయాన కేటాయింపులను నిర్వహించడంలో ఇబ్బంది పడింది. ప్రణాళికలో జరిగిన ఈ లోపం ప్రయాణికులకు ఆకస్మిక రద్దులు,సరైన సమాచారం లేకుండా సుధీర్ఘ నిరీక్షణగా మారింది.
కార్యాచరణ లేకపోవడం.. ప్రయాణీకుల సంరక్షణకు సీఈవో నేరుగా బాధ్యత వహించాలని డీజీసీఏ పేర్కొంది. ఈ వ్యవస్థలు విఫలమైనప్పుడు.. జవాబుదారీతనం తప్పక ఉంటుంది. అంతర్గత ప్రణాళిక సమస్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయని స్పష్టమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇలాంటి లోపాలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విమాన సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తమ నెట్వర్క్ ను రీసెట్ చేయడంలో భాగంగానే తాము విమానాలను రద్దు చేశామని ఇండిగో అంగీకరించింది. అంతరాయం తారాస్థాయిలో ఉన్నప్పుడు 700 సర్వీసులు మాత్రమే నడపగా..తర్వాత రోజు 1500 కిపైగా సర్వీసులతో కార్యకలాపాలు మెరుగుపడ్డాయి.
ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తే.. ఇండిగో ప్రణాళిక, సంక్షోభ నిర్వహణలో ఉన్నలోపాలను బహిర్గతం చేసింది. ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మెరుగైన ప్రణాళిక , స్పష్టమైన కమ్యూనికేషన్, ప్రయాణికుల సమాయానికి గౌరవం ఇవ్వడం అత్యవసరం. కేవలం వివరణలు ఇవ్వడం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.