నీ భార్యను ఇండియాకు పంపేయ్ జేడీ వాన్స్
ఒకవేలు మనం ఎదుటివారికి చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది.;
ఒకవేలు మనం ఎదుటివారికి చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగానే వలసలపై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటున్న జేడీ వాన్స్ కు ఈసారి నెటిజన్లు సోషల్ మీడియాలో కాస్తా గట్టిగానే ఇచ్చిపడేశారు. ముందు భారతీయురాలిని.. తెలుగు మహిళను చేసుకున్న నువ్వు ఆమెను.. నీ పిల్లలను, వారి తల్లిదండ్రులైన వలసవాదులను వారి దేశం పంపు తర్వాత మిగతా వారి సంగతి చూద్దాం అంటూ ఇచ్చిపడేస్తున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వలసల వ్యతిరేక వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగిలించడమేనని ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది విదేశీయులపై ద్వేశాన్ని పెంచే చర్యగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
జేడీ వాన్స్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ‘సామూహిక వలసలు కేవలం సరిహద్దు సమస్య కాదు. ఇది అమెరికన్ కార్మికుడి కలను దొంగతనం చేయడమే’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై యూఎస్ పౌరులు, ముఖ్యంగా వలస నేపథ్యం ఉన్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె కుటుబం, మీ పిల్లలు భారతీయులు. కాబట్టి ముందుగా వారిని ఇండియాకు పంపేయండి’ అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు పెడుతున్నారు. తన భార్య వలస నేపథ్యం ఉన్న హిందువు అయినప్పటికీ , వాన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు.
వలసల వ్యాఖ్యలకు తోడు, జేడీ వాన్స్ గతంలో చేసిన మరో కామెంట్ కూడా ఈ వివాదానికి ఆజ్యం పోసింది. హిందువైన తన భార్య, త్వరలో క్రైస్తవ మతంలోకి మారే అవకాశం ఉందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు వలసలపై ఆయన చేసిన ప్రకటనతో పాత వివాదాలు కూడా తెరపైకి వచ్చి నెటిజన్ల ఆగ్రహాన్ని మరింత పెంచాయి.
జేడీ వాన్స్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నప్పటికీ అమెరికన్ సమాజంలో వలసల ప్రాధాన్యతను ప్రశ్నించడంపై ఈ చర్చ మరింత ముదిరేలా కనిపిస్తోంది.