తిట్టుకొని.. గొప్పలు చెప్పుకునుడేంది సారూ?

Update: 2017-02-19 05:07 GMT
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చురుగ్గా వ్యవహరించటం.. సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించటం.. లెక్కతేడా వస్తే.. ఎంతవరకైనా సరే అన్నట్లుగా వ్యవహరించే నేతల్లో నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారు. పార్టీ సంగతి తర్వాత.. తనకు తాను వ్యక్తిగతంగా గొప్పగా ఫీలైపోవటం.. తనకు పొసగని నేతలపై విరుచుకుపడటం లాంటివి ఓపెన్ గా చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని వైనం ఆయనలో కనిపిస్తుంది.

పవర్ చేతిలో లేని వేళ.. ఐక్యమత్యంతో ఉండాలన్న భావన కంటే.. పార్టీలో తానే సుప్రీంగా ఉండాలన్న ఫీలింగ్ కోమటిరెడ్డిలో ఎక్కువని చెబుతారు. నల్గొండ జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతల్లో ఒకరైన కోమటి రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయనపై విమర్శలు చేసేందుకు ఆయన చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తమ్ ను విమర్శిస్తే పార్టీ ఇమేజ్ పాడవుతుందన్న విషయాన్ని లైట్ తీసుకునే ఆయన.. తీవ్ర వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడరు. తాజాగా ఉత్తమ్ సర్వేపై విరుచుకుపడటమేకాదు.. 2019వరకూ తానే తెలంగాణ రాష్ట్ర పార్టీ చీఫ్ అన్న మాటల్ని ఖండించిన ఆయన.. తాజాగా తనను తాను విపరీతంగా పొగిడేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కారణంగా తెలంగాణ ఎలా వచ్చిందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతానని చెబుతున్న కోమటిరెడ్డి.. తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను చేసే పాదయాత్రతో పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పటమే కాదు.. తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ వీరావేశంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఓవైపు పార్టీ రథసారధిపై చేసిన విమర్శల్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉంటే.. వాటిని పట్టించుకోకుండా తన ధోరణితో తాను వెళుతున్న కోమటిరెడ్డి తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శలతో దుమ్మెత్తిపోశారు. తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి తరిమికొడతామన్న మంత్రి తుమ్మల..తలసాని లాంటి వాళ్లు కేసీఆర్ కు ముద్దు అయ్యారని.. తెలంగాణ కోసం పదవులు వదులుకొని పోరాటం చేసిన తాను.. కోదండం మాష్టారు మాత్రం భారంగా మారినట్లుగా మండిపడ్డారు.

ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో కేసీఆర్ లేరని.. అయినా తమకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అవసరం లేదని.. రెండేళ్లలో తామే పవర్ లోకి రానున్నట్లుగా వెల్లడించారు. శ్రీశైలం సొరంగం వద్ద కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేస్తామని చెప్పిన ఆయన.. దళితుడ్నిముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ మాదిరే మోసం చేశారన్నారు. కనీసం సమీక్షలు చేయకుండా ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత.. నల్లగొండ జిల్లా ప్రజలకు నాలుగు నెలలుగా తాగునీరు నిలిచిపోయిందన్న ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయిందంటూ మండిపడ్డారు. ప్రత్యర్థుల్ని తిట్టటం బాగానే ఉన్నా.. సొంత పార్టీ వాళ్లను సైతం వదిలిపెట్టకపోవటమే కోమటిరెడ్డితో వచ్చేఇబ్బందన్న మాట వినిపిస్తోంది. అధికారపక్షంపై పోట్లాటకు పోయేటప్పుడు.. అందరిని కలుపుకుపోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News