‘కియా’ కంపెనీ పేరు మారిపోనుంది.. అసలు కారణం ఇదేనట

Update: 2021-05-26 04:30 GMT
తక్కువ వ్యవధిలో భారత్ లో తన ముద్ర వేసింది దక్షిణ కొరియాకు చెందిన వాహన దిగ్గజ కంపెనీ కియా. తొలి అడుగులోనే.. ప్రధాన వాహన కంపెనీలకు ధీటుగా వాహనాల అమ్మకాలతో పాటు.. వాహన రంగం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తమ వాహనాల్ని అమ్మటంలో కియా సాధించిన విజయం.. వ్యాపార వర్గాల్ని విస్మయానికి గురి చేసింది. కియా కార్లను కొనేందుకు యూత్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. దీంతో.. అంచనాలకు మించి కియా కార్లకు డిమాండ్ పెరిగింది.

రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే అగ్రగామి కార్ల తయారీ కంపెనీగా కియా మారింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇండియాలో తమ కంపెనీ పేరును.. లోగోను మార్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికైతే కంపెనీ పేరును మార్చేసింది. ఇప్పటివరకు కియా మోటార్స్ ఇండియా అన్న పేరుతో ఉన్న సంస్థను  ‘కియా ఇండియా  ప్రైవేటు లిమిటెడ్’గా మార్పు చేసినట్లుగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పేరులో మార్పుతో పాటు.. లోగోలోనూ మార్పులు చేస్తున్నట్లు చెప్పింది.

దశల వారీగా డీలర్ షిప్ కేంద్రాల దగ్గర కూడా కొత్త మార్పులకు తగ్గట్లు మార్పులు ఉంటాయని చెప్పింది. ఇంతకీ కంపెనీ పేరు మార్చటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి బదులిచ్చిన కంపెనీ.. భారత్ లో తమ కంపెనీకి లభించిన విజయంతో.. మరింత గుర్తింపు కోసం పేరును మార్చినట్లుగా చెప్పింది. తాజాగా చేసిన మార్పు కంపెనీ ఉన్నతికి కారణమవుతుందన్న అంచనాను వ్యక్తం చేసింది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News