సౌదీ యువరాజు ఆదేశాల ప్ర‌కార‌మే ఖ‌షోగ్గి హ‌త్య : అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్!

Update: 2021-02-28 01:33 GMT
సౌదీ ఆరేబియా యువరాజు  మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఆదేశాల మేర‌కు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య జ‌రిగిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. సౌదీ యువరాజు ఈ హత్య పథకానికి ఆమోదం తెలిపారని, దాని ప్రకారమే అమెరికాలో ఉంటున్న సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ సజీవంగా బంధించాలని లేదా చంపాలని నిర్ణయించారని నిఘా విభాగం శుక్రవారం జారీ చేసిన ఒక రిపోర్టులో తెలిపింది. అమెరికా ఈ హత్య కేసులో మొదటిసారి నేరుగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ పేరు బయటపెట్టింది. అయితే, ఖషోగ్జీ హత్యకు తను ఆదేశించాననే ఆరోపణలను సౌదీ యువరాజు కొట్టిపారేశారు.

2018లో ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్ ‌లోని సౌదీ కౌన్సులేట్‌లో ఖ‌షోగ్గి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఆ ఘ‌ట‌న ప‌ట్ల బైడెన్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం నివేదిక‌ను రిలీజ్ చేసింది.  ఖ‌షోగ్గిని బంధించండి లేదా హ‌త్య చేయాలంటూ ప్రిన్స్ స‌ల్మాన్ ఆదేశించిన‌ట్లు ఆ నివేదిక‌లో తెలిపారు.  మ‌రోవైపు అమెరికా ప్ర‌భుత్వం సౌదీపై డ‌జ‌న్ల సంఖ్య‌లో ఆంక్ష‌ల‌ను ప్ర‌క‌టించింది. కానీ ప్రిన్స్ స‌ల్మాన్‌ పై ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

59 ఏళ్ల ఖ‌షోగ్గి.. సౌదీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ వాషింగ్ట‌న్ పోస్టు ప‌త్రిక‌లో అనేక క‌థ‌నాలు రాశారు. ఒక‌ప్పుడు సౌదీ రాజ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఖ‌షోగ్గి.. ఆ త‌ర్వాత 2017లో అమెరికాలో త‌ల‌దాచుకున్నారు. సౌదీ రాజు స‌ల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కుమారుడే ప్రిన్స్ స‌ల్మాన్‌.  ఖ‌షోగ్గి మ‌ర్డ‌ర్ ఆప‌రేష‌న్‌కు ప్రిన్స్ స‌ల్మాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు రుజువు చేసేందుకు మూడు కార‌ణాల‌ను నివేదిక పేర్కొన్న‌ది. 
Tags:    

Similar News