కేసీఆర్ వెళ్లరు కానీ..ఆయన బ్యాచ్ వెళుతుందా?

Update: 2015-10-17 07:17 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎవరు వస్తారు? ఎవరు రారు అన్న విషయంపై చర్చ జరుగుతుందంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రమే. ఆయన్ను ఏపీ సీఎం ఆహ్వానిస్తారా? ఒకవేళ అవునైతే.. ఎలా ఆహ్వానిస్తారు? అన్న సందేహాలకు చంద్రబాబే సమాధానం ఇచ్చేశారు. తానే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి.. సంప్రదాయం ప్రకారం శంకుస్థాపనకు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.

ఇక.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కూడా సానుకూల స్పందన ఉందన్న మాటలకు బలం చేకూరుస్తూ.. ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్ స్పందన కూడా సానుకూలం ఉన్న విషయం తెలిసిందే. శంకుస్థాపనకు తమను ఆహ్వానిస్తే తాము వెళతామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. యాదాద్రి పనులను మొదలు పెట్టటంతో పాటు.. కేసీఆర్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహప్రవేశాలతో పాటు మరికొన్ని కార్యక్రమాలు దసరా రోజునే చేపట్టాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న శుభకార్యాల్ని వదిలేసి.. పక్కింటికి వెళ్లి కూర్చోరు కదా.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తాను వెళ్లకుండా.. తన మంత్రుల బృందాన్ని అమరావతి శంకుస్థాపనకు పంపే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. సంప్రదాయంగా పిలిచినా వెళ్లలేదన్న అపప్రద మూటగట్టుకోకుండా ఉండకుండా ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందాన్ని పంపుతారన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్యక్రమాల జోరు చూస్తే మాత్రం అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లటం కష్టమేనంటున్నారు.
Tags:    

Similar News