తలసాని తలనొప్పికి మందు ఇదా..!!

Update: 2015-10-04 07:24 GMT
 అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న డాక్టర్ రాజయ్య ను తొలగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారా..? త్వరలో తెలంగాణ కేబినెట్ లో చేపట్టబోయే మార్పలు చేర్పుల్లో ఊహించని పరిణామాలు కనిపిస్తాయా?.. అంటే అవుననే అంటున్నారు టీఆరెస్ నేతలు.  ఇటీవల వరుసగా రెండు రోజుల పాటు గవర్నరుతో కేసీఆర్ భేటీ అయిన సందర్బంలో గవర్నరు... తలసానిపై నిర్ణయం తీసుకోమని సూచించినట్లు తెలిసింది.

తలసాని వ్యవహారం టీఆరెస్ కు తలనొప్పిగానే మారింది. తాను రాజీనామా చేసానని తలసాని పదేపదే చెబుతుండడంతో దాన్ని ఎందుకు ఆమోదించడం లేదన్న డిమాండు మరింత గట్టిగా వినిపిస్తోంది. ఏదో ఒక సాంకేతిక కారణం చూపించి రాజీనామా లేఖను వెనక్కు పంపించాలన్నా కూడా అది ఇప్పటి అప్పటి విషయం కూడా కాదు. ఇప్పుడు తిరస్కరిస్తే స్పీకరుకు చెడ్డపేరు వస్తుంది.... దీంతో ఈ విషయంలో తాత్సారం చేస్తూ వస్తున్నారు. అలా అని రాజీనామాను ఆమోదిస్తే తలసాని మళ్లీ పోటీ చేసి గెలవాలి... అది అంత సులభం కాదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తలసానిని కేబినెట్ నుంచి తప్పించడమే ఉత్తమ మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా తలసానితో పాటు మరో ఇద్దరు మంత్రులనూ కేబినెట్ నుంచి తొలగించే సూచనలున్నాయి. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇబ్బంది పడుతున్న నాయిని నరసింహారెడ్డి... ఆరోపణలు ఎదుర్కొంటున్న పోచారం శ్రీనివాసరెడ్డిలను కూడా మంత్రివర్గం నుంచి తప్పిస్తారని తెలుస్తోంది.

కేబినెట్ నుంచి తలసానిని తప్పిస్తే ఆ వ్యవహారానికి ముగింపు పలికినట్లు అవుతుంది. నెలల తరబడి వివాదంగా మారిని తలసాని తలనొప్పికి కేసీఆర్ ఈ విధమైన పరిష్కారం ఇస్తారని కూడా ఎవరూ ఊహించకపోవచ్చు.. కానీ, అది నిజమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News