కరోనా నేర్పిన పాఠం... కేసీఆర్ మోదీకి అప్పజెప్పారు

Update: 2020-08-11 17:30 GMT
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మానవాళికి ఓ పెద్ద పాఠమే నేర్పింది. వ్యక్తిగత శుభ్రతతో పాటుగా వైరస్ ల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయంతో పాటు మరింత మెరుగైన వైద్య సేవలను, విస్తృతంగా అందాల్సిన వైద్య సేవల అవసరాన్ని చెప్పకనే చెప్పింది. ఈ మాటలన్నది మరెవరో కాదు... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావే. కరోనా నుంచి మనకు అవగతమైన పాఠాలను తూచా తప్పకుండా పాటించాలంటూ ఆయన... నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే అప్పజెప్పేశారు.

కరోనా విస్తృతి, దాని కట్టడి కోసం చేపట్టిన చర్యలపై మంగళవారం పలు రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేర్పిన పాఠం ఇదేనని, ఈ పాఠాన్ని అవగతం చేసుకుని చర్యలు చేపట్టాలని మోదీకి కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారన్న విషయానికి వస్తే... కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలి. కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి’’ అని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

‘‘గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. దేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి ? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి ? లాంటి విషయాలను ఆలోచించాలి.దీనిపై ఐఎంఎ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మరింత చొరవ చూపాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు.
Tags:    

Similar News