బొప్పాయి సాగు పనుల్లో కేసీఆర్ బిజీ

Update: 2016-07-27 04:58 GMT
దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేని కొన్ని పనులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే చేయగలుగుతారని చెప్పాలి. ఎక్కడి వరకో ఎందుకు.. ఏపీ ముఖ్యమంత్రినే చూద్దాం. ఆయన తన మనమడితో ఆడుకోవటానికి కూడా టైం సరిపోవటం లేదని.. ఎప్పుడైనా మనమడ్ని కలిసినప్పుడు కొత్త ముఖాన్ని చూసినట్లుగా చూసి ఏడుస్తున్నారంటూ ఆయన పలుమార్లు ఇప్పటికే వాపోవటం తెలిసిందే.

మరి.. క్షణం తీరిక లేకుండా చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. తన వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతంగా ఉండటమే కాదు.. తాను సాగు చేస్తున్న పంటల్ని పరిశీలిస్తూ ఉండటం.. అది కూడా రోజులకు రోజులు కాలం గడిపేయటం విశేషంగానే చెప్పాలి. ఢిల్లీకి వెళ్లటానికి ముందు వ్యవసాయ క్షేత్రంలోనే గడిపిన కేసీఆర్.. ఢిల్లీ నుంచి వచ్చాక ఒక రోజు మాత్రమే హైదరాబాద్ లో ఉండి శని.. ఆదివారాలు ఫాంహౌస్ లోనే ఉన్నారు.

అనంతరం సోమవారం బయటకు వచ్చిన ఆయన.. అదే రోజుసాయంత్రం తిరిగి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మంగళవారం మొత్తం వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న ఆయన.. తన ఫాంహౌస్ లో ఖరీఫ్ పంట కింద బొప్పాయిని భారీగా సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనుల్ని నిశితంగా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఉదయం కాలి నడకన తన ఫాంహౌస్ లో తిరిగిన ఆయన.. పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించినట్లుగా చెబుతున్నారు. ఓపక్క మల్లన్నసాగర్ వ్యవహారంలో పోలీసుల లాఠీ ఛార్జ్ లాంటి అంశాలు.. మరోవైపు వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలో భారీ ట్రాఫిక్ జాంలతో గంటల కొద్దీ సమయం రోడ్ల మీద గడిపేస్తూ లక్షలాది మంది నరకయాతన పడుతుంటే.. వీటికి దూరంగా కేసీఆర్ తన ఫాంహౌస్ లో వ్యవసాయ పనులు చూసుకోవటం ఏమిటి..?
Tags:    

Similar News