జగన్ 3 బిల్లుల ముచ్చట తెలంగాణ కట్టా శేఖర్ రెడ్డికి ఎలా తట్టింది?

Update: 2021-11-23 04:17 GMT
ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారింది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం. ఏపీలో మూడు రాజధానుల్ని నిర్మిస్తామని చెబుతూ తీసుకొచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్న వైఎస్ సర్కారు నిర్ణయం వెనుకున్న అసలు మర్మం ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోలాంటి వాదనను వినిపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ సర్కారు నుంచి వెలువడాల్సిన అధికారిక నిర్ణయానికి కొన్ని గంటల ముందు తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు.. ప్రస్తుతం సమాచార హక్కు కమిషనర్ గా వ్యవహరిస్తున్న కట్టా శేఖర్ రెడ్డికి ఎలా తెలిసిందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీ ప్రజలకు అంత సుపరిచితుడు కాదు కానీ.. తెలంగాణలో అందరికి తెలిసిన కట్టా శేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ.. అనుకోని సందర్భం రావటంతో ఇప్పుడాయన బ్యాక్ గ్రౌండ్ గురించి కాసింత తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉదయం.. వార్త.. ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘ కాలం పని చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరించారు. కొంతకాలంగా మాత్రం ఆయన.. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కుకమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.
Read more!

తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువైన ఆయన.. ఆదివారం రాత్రి వేళలో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల వ్యవహారం వెనక్కి తీసుకోవటం ఉత్తమం అన్న సలహాను ఇవ్వటం.. ఈ ట్వీట్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే తాము తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వైఎస్ జగన్ సర్కారు వెనక్కి తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మీడియా మొదలు మొనగాళ్లుగా ఉన్న చాలామందికి తట్టని ఆలోచన కట్టా శేఖర్ రెడ్డికి ఎలా తట్టింది? విషయం ఆయ నకు ముందే తెలిసిందా? అన్నది సందేహంగా మారింది. ఇంతకూ కట్టా శేఖర్ రెడ్డి చేసిన రెండు ట్వీట్లలో ఏముందన్నది చూస్తే..
‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన రాజధాని. తన ప్రతిపాదన వీగిపోక ముందే జగన్మోహన్ రెడ్డి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతయిన గౌరవం దక్కుతుంది’’
‘‘ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని.
4

మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన. అది వీగిపోతుంది. న్యాయపరీక్షలో ఓడిపోయే అవకాశమూ ఉంది. అక్రమమో సక్రమమో అమరావతి అందరూ గుర్తించిన రాజధాని’’ అంటూ ఆదివారం రాత్రి దాదాపు పదకొండు గంటల వేళలో పోస్టు చేశారు.

గంటల వ్యవధిలోనే ఆయన ట్వీట్లలో చేసిన సూచనకు తగ్గట్లే ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం శంషాబాద్ లో జరిగిన పెళ్లి వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటం.. కలిసి భోజనం చేయటమే కాదు.. ఏకాంతంగా కాసేపు మాట్లాడిన వైనం చూశాక.. మూడు రాజధానుల్ని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి సంబంధించిన ఏదో లీకు బయటకు వచ్చి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ఎవరికి తెలీని విషయాన్ని కట్టా శేఖర్ రెడ్డి గుర్తించి.. ప్రజలతో షేర్ చేసుకున్న ఈ ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.




Tags:    

Similar News