నిన్న కొడుకు - నేడు తండ్రి..జగన్ ను వదిలేలా లేరే

Update: 2019-06-15 16:33 GMT
తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ బంపర్ విక్టరీ కొట్టేసింది. నవ్యాంధ్రకు నూతన సీఎంగా జగన్ పదవీ ప్రమాణం చేశారు. ఏపీలో తనదైన శైలి పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్... నిజంగానే దేశంలోని అన్ని రాష్ట్రాల దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇలా జగన్ వైపు ఆసక్తిగా చూసే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక అందరి కంటే ముందు ఉందని చెప్పాలి. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఓ వారానికే అమరావతిలో వాలిపోయిన జేడీఎస్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. జగన్ తో భేటీ అయ్యారు. సరే... ఈ భేటీ ఏదో మర్యాదపూర్వకంలే అనుకున్నా... ప్రఃస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ను నిఖిల్ తండ్రి - జేడీఎస్ కీలక నేత - కర్ణాటక సీఎం కుమారస్వామి కలిశారు.

ఏపీ భవన్ లో ఉన్న జగన్ వద్దకు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిన కుమార... జగన్ తో చాలాసేపే చర్చలు జరిపారు. అయినా నిన్న కుమారుడు - నేడు తండ్రి జగన్ తో ఏం చర్చించారు? అసలు వారి అజెండా ఏమిటి? అన్నది మనకు తెలిసిన విషయమే. కర్ణాటకలో మరింత బలోపేతంగా తయారయ్యే క్రమంలో అక్కడి రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునే క్రమంలోనే రెడ్లకు ప్రతినిధిగా నిలిచిన జగన్ తో వారు సఖ్యతను కోరుకుంటున్నారన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్ కు కొన్ని ప్రాంతాల్లోనే పట్టుంది. ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీ కూడా మెజారిటీ స్థానాలను దక్కించుకుంటున్నాయి. జేడీఎస్ నేతగా కుమారస్వామి ఇప్పటికే రెండు సార్లు సీఎంగా పదవి చేపట్టినా... సంకీర్ణంలో భాగంగానే ఆయనకు ఆ పదవి దక్కింది.

మరి సింగిల్ గా... బీజేపీ - కాంగ్రెస్ లను అల్లంత దూరానికి తరమేసి తామే తమ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది జేడీఎస్ నేతల వ్యూహం. ఆ వ్యూహాన్ని ఫలప్రదం చేసుకునేందుకే మొన్న నిఖిల్ - ఇప్పుడు కుమారస్వామి జగన్ వెంటపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రానికి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేతకు శుభాకాంక్షలు చెప్పేందుకు అయితే కుమార వస్తే సరిపోతుంది కదా. మరి అంతకంటే ముందుగానే తన కుమారుడిని నేరుగా అమరావతిని పంపి మరీ జగన్ కు గ్రీటింగ్స్ చెప్పించారంటే... వారి వ్యూహం కాస్తంత పకడ్బందీగానే సాగుతున్నట్టే కదా. ఏదేమైనా తమ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు జేడీఎస్ నేతలు... జగన్ మద్దతును కూడగట్టుకునే పనిని కాస్తంత సీరియస్ గానే చేస్తున్నారని చెప్పాలి. మరి వారి కోరికను జగన్ తీరుస్తారో? లేదో? చూడాలి.
Tags:    

Similar News