కాషాయానికి కమ్మ సామాజికవర్గం సాయం!?

Update: 2019-06-06 07:30 GMT
ఏపీలోని అధిక శాతం కమ్మ సామాజిక వర్గ నాయకుల చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడింది. ఇంతవరకు ఈ సామాజికవర్గం - తెలుగుదేశం పార్టీ కలిసిమెలసి సాగాయి. కానీ, తాజా ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఘన విజయం తెలుగుదేశం పార్టీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఆందోళనలో పడేశాయి. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గం లోని నేతలు - వ్యాపారవేత్తలు - పారిశ్రామిక వర్గానికి చెందినవారు  అంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ అవకాశాల కోసం చూస్తున్నారు. అధికార బలం లేకుండా అయిదేళ్లు గడిపితే ఆర్థికంగా దెబ్బతింటామన్న సత్యాన్ని గుర్తించిన ఆ వర్గం ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తోంది.

నిజానికి ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం వైసీపీయే. కానీ.. వైసీపీ అంటే ఎక్కువగా రెడ్డి సామాజికవర్గానికి చెందినదిగా ముద్ర ఉంది. ముఖ్యంగా ఎక్కువ శాతం కమ్మ సామాజికవర్గ నేతలు వైసీపీని తమది కాని పార్టీగానే చూస్తుంటారు. వైసీపీ వల్లే తమకు ముప్పుందని భయపడుతుంటారు. వైసీపీ తమను ఆదరించదేమో అని అనుమానపడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ అనుకూల నేతలెవరూ వైసీపీ వైపు చూడను కూడా చూడరు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏపీలోనే కాదు.. దేశంలోనూ అత్యంత బలహీన పరిస్థితుల్లో ఉంది. దీంతో అధిక శాతం కమ్మ సామాజికవర్గం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న అత్యంత బలమైన పార్టీ బీజేపీ వైపు చూస్తోంది. ఏపీలోని ఇంకే సామాజికవర్గం బీజేపీని ఆశ్రయించకముందే.. బీజేపీ ఇంకే సామాజికవర్గాన్ని చేరదీయకముందే తాము అటాచ్ కావాలని పావులు కదుపుతోంది. ఆ క్రమంలోనే గతంలో ఎంపీలుగా పనిచేసి.. కేంద్రంలోని బీజేపీ నేతలతో సాన్నిహిత్యం ఉన్న వారు మంతనాలు జరుపుతున్నారు.

కమ్మ సామాజికవర్గం నుంచి బీజేపీలో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ నేతపైనా సామాజికవర్గానికి చెందిన పెట్టుబడిదారులు - పారిశ్రామికవేత్తలు - నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి ఇంతకాలం రాజకీయ ప్రతినిధిగా ఉన్న చంద్రబాబునాయుడు బీజేపీ నంబర్ 1 - 2లు అయిన మోదీ - అమిత్ షాలకు బద్ధవిరోధిగా మారిపోయిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభావం లేకుండా తమను బీజేపీకి అటాచ్ చేయమని ఆ కమ్మ సామాజికవర్గ బీజేపీ నేతను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ నేతకు చంద్రబాబుపై వల్లమాలిన మమకారం ఉండడంతో దీనిపై సానుకూలంగా లేరనీ ప్రచారం.

ముఖ్యంగా ఈసారి రెడ్డి సామాజికవర్గమంతా ఏకమై వైసీపీని గెలిపించుకుందని.. రెడ్డి సామాజికవర్గం అంతలా వైసీపీని ఆదరించినప్పుడు ఇది కేవలం 2019 ఎన్నికకే పరమితం కాకుండా రానున్న ఎణ్నికల్లోనూ ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి 2024లో టీడీపీ అధికారం వస్తుందన్న ఆశలు లేవన్నది కమ్మ సామాజికవర్గ నేతల మాట. ఇదే జరిగితే రెడ్డి సామాజికవర్గాన్ని తట్టుకుని నిలిచి రాజకీయాలు - వ్యాపారాలు చేయడం సులభం కాదన్నది వారు గ్రహించిన సూక్ష్మం. కాబట్టి మరో బలమైన అండకోసం వారు బీజేపీని బలపరచడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా విజయవాడ ఎంపీ - టీడీపీ నేత కేశినేని నాని బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ సామాజికవర్గంలోని అనేక మంది నేతల ఆలోచనలు నాని మాదిరిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే టీడీపీకి భారీ నష్టం తప్పదు.


Tags:    

Similar News