తమిళ సాంప్రదాయానికి చెక్ ఫెట్టిన కమల్

Update: 2018-02-21 11:27 GMT
కమల్ హాసన్ బుదవారం నాడు రామేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. ఒక ప్రధానమైన సనాతనమైన తమిళ రాజకీయ సాంప్రదాయానికి ఆయన చెక్ పెట్టారు. పార్టీ నేతను అభిమానులు లేదా ఇతరులు కలవడానికి వచ్చినప్పుడు శాలువాలు కప్పడం అనేది సాంప్రదాయం. తన పార్టీ విషయంలో అభిమానులు ఇక ఎప్పుడూ శాలువాలు తేవద్దని.. శాలువాల సంస్కృతిని ఆపేస్తున్నా అని కమల్ హాసన్ ప్రకటించారు. పనిలో పనిగా.. తానే అందరికీ శాలువాగా మారుతానంటూ ఓ పంచ్ డైలాగు కూడా వేశారు.

ఇక్కడ చిన్న ఆలోచానాత్మక దృక్పథం లోపించిందని అనిపిస్తోంది. శాలువాలు కప్పడం అనేది తమిళుల్లో పెద్దలను కలవడానికి వెళ్లినప్పుడు పాటించే పురాతన సాంప్రదాయం. సాధారణంగా ఎవరైనా పెద్దలను కలవడానికి వెళితే.. వట్టిచేతులతో వెళ్తే బాగుండదని కొందరు, ఇంప్రెస్ చేసే ఉద్దేశంతో కొందరు విలువైన కానుకలను తీసుకువెళుతూ ఉంటారు. అయితే కానుకలను అనుమతిస్తే.. ఆయా వ్యక్తుల కానుకల్ని బట్టి.. వారి వినతుల  పట్ల స్పందించే తీరు మారిపోతుందనే ఉద్దేశంతో అందరికీ అందుబాటులో ఉండేలా.. సామాన్యమైన నూలు శాలువా.. పార్టీ గుర్తు ఉండే కండువాను కప్పి.. పెద్దలను సత్కారపూర్వకంగా కలుసుకునే సాంప్రదాయం వచ్చింది. కాలక్రమంలో చేనేత, నూలు శాలువాలను, పార్టీ రంగు శాలువాలను కప్పే బదులుగా.. ఖరీదైన శాలువాలు కప్పే దుస్సాంప్రదాయంగా మారింది. తన పార్టీ విషయంలో కమల్ ఆ పద్ధతికి చెక్ చెప్పారు. దీని బదులు ఆయన కొద్దిగా మార్పులు చేసి ఉంటే బాగుండేది.

కేవలం తమిళనాడులోని చేనేత కార్మికులు నేసే.. నూలు సాధారణ శాలువాలు మాత్రమే తమ పార్టీ అనుమతించాలని ఆయన పిలుపు ఇచ్చి ఉంటే బాగుండేది. దానివలన.. ఇప్పటికే రకరకాల ఆధునిక పోటీని తట్టుకోలేక కునారిల్లుతున్న చేనేత కార్మికులకు వ్యవస్థీకృతంగా కొంత అండగా నిలిచినట్లు ఉండేది. అదే సమయంలో.. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బాట కూడా ఈ విషయంలో అనుసరణీయమే.

ఆయనకు ఏ కార్యక్రమానికి వెళ్లినా కొన్ని వందల కండువాలు, శాలువాలు వస్తుండేవి. ఆయన వాటన్నిటినీ జాగ్రత్తగా తీసుకువచ్చి.. తిరిగి శ్రద్ధగా అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పంపుతుండేవారు. ఆ రకంగా వాటి అవసరం ఉన్న ఒక వర్గానికి అవి అందేవి. కమల్ అలాంటి పనిచేసినా.. సామాజిక ప్రయోజనం ఉండేది. అంతే తప్ప.. ఏకంగా సాంప్రదాయాన్నే తుడిచేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు సూచిస్తున్నారు.
Tags:    

Similar News