బిగ్ అలర్ట్: ఒకప్పుడు కామెడీ స్కిల్.. ఇప్పుడు దోపిడీకి కొత్త మార్గం!
వాస్తవానికి దశాబ్ధాలుగా మిమిక్రీ నైపుణ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్ట్ లో అద్భుతమైన స్కిల్స్ ఉన్న కళాకారులు ఉన్నారు.;
'నాన్న నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.. నేను బయట ఉన్నాను.. ఈ నెంబర్ కు డబ్బులు పంపండి.. అర్జంట్..' అని తండ్రికి కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. అందులో అనుమానించడానికి ఏమీ లేదు. ఆ వాయిస్ తన కుమార్తెదే..! ఆ సమయంలో సదరు తండ్రి మరో ఆలోచన చేయగలడా..? ఒక్క నిమిషం ఆగు తల్లి అంటూ వెంటనే కాల్ వచ్చిన నెంబర్ కు డబ్బులు పంపించేస్తారు కదా! ఇప్పుడు ఇది సైబర్ క్రైమ్ లో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోంది!
అవును... ఓటీపీ చెప్పమంటూ బ్యాంకుల నుంచి అంటూ ఫోన్లు, హనీట్రాప్ లు, డిజిటల్ అరెస్టులతో ఇప్పటికే అలసిపోయి, బెదిరిపోతోన్న సగటు జీవిని ఇప్పుడు మరోరకం సైబర్ క్రైమ్ టెన్షన్ పెడుతోందని అంటున్నారు. పైన చెప్పుకున్న ఘటనలో ఆ కుమార్తె ఇంట్లోనే క్షేమంగా ఉంది, కాకపోతే తండ్రి బయట ఉన్నారు, తన భార్యకు ఫోన్ చేసి కనుక్కునే సమయం, ఆలోచన ఉండే అవకాశం తక్కువ! ఇదే వాయిస్ క్లోనింగ్ స్కామ్!
వాస్తవానికి దశాబ్ధాలుగా మిమిక్రీ నైపుణ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్ట్ లో అద్భుతమైన స్కిల్స్ ఉన్న కళాకారులు ఉన్నారు. టీవీల్లోనూ, వేదికలపైనా వారి ప్రదర్శనలు ప్రేక్షకులను అబ్బురపరిచేవి. ఈ స్కిల్ తో ఇంటికో, స్నేహితుడి ఇంటికో కాల్ చేసి ఆటపట్టించినవారూ ఉన్నారు. అయితే అది ఒకప్పుడు! ఇప్పుడు లెక్కలు మారాయి.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అని మరిచిపోతే బ్యాంక్ అకౌంట్ లో అంకెలు మారిపోతాయి!
ప్రస్తుతం ఈ అధునాతన వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేయడానికి కొంత సాంకేతిక నైపుణ్యం అవసరమే కానీ.. ముందు ముందు దీన్ని అమలు చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భూగ్రహం మీద ఉన్న దాదాపు మెజారిటీ వ్యక్తుల చేతుల్లో సెల్ ఫోన్ ఉంది.. అందులో ఏఐ ఏజెంట్లు, వాయిస్ బాట్ లు, చాట్ బాట్ లకు సంబంధించిన యాప్ లు అందుబాటులో ఉన్నాయి!
అలా అని ఇది కేవలం ఆర్థికపరమైన నష్టాలకు సంబంధించిన సమస్య అని మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇప్పటికే సంప్రదాయ టెక్స్ట్ ఆధారిత స్కామ్ లు వేలాది మందిని ప్రతిరోజూ మోస చేస్తున్నాయి! ఇక ఇష్టమైన వ్యక్తి, కావాల్సిన వ్యక్తి, ప్రియమైన వ్యక్తికి సంబంధించిన నిజమైన వాయిస్ తో కాల్ వస్తే.. అది ఆర్థిక నష్టాలకు మించిన సమస్యలను తెచ్చి పెట్టొచ్చు! అందుకే... బి కేర్ ఫుల్ అంటున్నారు నిపుణులు!