వైఎస్సార్‌సీపీ నేతలకు ఇక రాళ్ల దెబ్బలే: జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలనం

Update: 2022-05-22 13:30 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట యాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని.. ఇక ప్రజలు వాళ్లను రాళ్లతో తరిమికొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం యాత్ర ముగిశాక ఇక వైఎస్సార్‌సీపీ నేతలు రైలు యాత్ర చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలు మే 12 నుంచి గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రతి ఇంటికి వెళ్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గ ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరడం లేదని.. తాగు నీరు సమస్య ఉందని.. రోడ్ల సమస్య ఉందని ఇలా అనేక సమస్యలను ఏకరవూ పెడుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అంటున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం విఫలం కావడంతోనే బస్సు యాత్ర పేరుతో మంత్రులు బయలుదేరుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు ఎక్కువ మంది పోలీసులను వెంట బెట్టుకుని వెళ్లాలని లేదంటే ప్రజల నుంచి వాళ్లకు రాళ్ల దెబ్బలు తప్పవన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను రాయదుర్గంలో ఆలయానికి కూడా వెళ్లనీయడం లేదని నిప్పులు చెరిగారు. ఆయనతో కలసి తాను త్వరలోనే దేవాలయానికి వెళ్తానని.. దమ్ముంటే తనను అడ్డుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

కాగా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేసీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది. జేసీ కుటుంబానికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ను మూసివేయించింది. అలాగే జేసీ ప్రభాకర్‌పై అనేక కేసులు నమోదు చేయించింది. ఒక కేసు నుంచి బెయిల్‌పై విడుదలవ్వడం ఆలస్యం మరో కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంటూ చుక్కలు చూపించింది. అనంతపురం జిల్లాలో కాకుండా పక్క జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేయిస్తూ జైల్లో కూడా పెట్టింది. చివరకు హైకోర్టును ఆశ్రయించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి బెయిల్‌పైన బయట ఉన్నారు. అయినా ఏమాత్రం వెరవకుండా జగన్‌ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News