ఉప ఎన్నికలో ''అమ్మ''కు అద్బుత విజయం

Update: 2015-06-30 08:14 GMT
అమ్మగా కీర్తించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో రికార్డు సాధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆమె.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం.. చెన్నై పరిధిలోని ఆర్కే నగర్‌లో ఉప ఎన్నికలో పోటీ చేయటం తెలిసిందే.

ఏకపక్షంగా సాగుతుందని భావించినట్లే.. ఉప ఎన్నికలో అమ్మకే ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరపగా.. జయలలిత తన సమీప ప్రత్యర్థి కంటే 1,60,921 మెజార్టీ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమెపై పోటీ చేసిన సీపీఐ అభ్యర్తి మహేంద్రన్‌కు కేవలం 10వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెపై పోటీకి దిగిన 27 మంది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి.

ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో 90 శాతం ఓట్లు జయలలితకే పడటం గమనార్హం. భారత అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో పోలైన ఓట్లలో ఇంత భారీ శాతంలో ఓట్లు పడటం ఒకరికార్డు అని..  అది తమ అమ్మ.. జయలలితకే దక్కిందని అన్నాడీఎంకే వర్గాలు ఆనందంతో చెప్పుకుంటున్నాయి. తాజా రికార్డు విజయం అన్నాడీఎంకే కార్యకర్తలు.. అభిమానులకు మరో పండుగ దినంగా అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News