రాంపూర్‌ సరే.. రాజమండ్రి ఎప్పుడు.?

Update: 2019-03-27 01:30 GMT
తెలుగు హీరోయిన్స్‌ లో జయప్రద అంత అందగత్తె లేదు అంటే అతిశయోక్తి కాదు. సత్యజిత్‌ రే లాంటి వ్యక్తే  జయప్రద అందాలను ఫిదా అయిపోయాడు. తెలుగు ఇండస్ట్రీతో పాటు హిందీ ఇండస్ట్రీని ఏలిన జయప్రదను రాజకీయాల్లో మాత్రం తెలుగు ప్రజలు ఎప్పుడూ పట్టించుకోలేదు. మొదట టీడీపీలో ఉన్న జయప్రద.. చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకున్న తర్వాత సమాజ్‌ వాదీ పార్టీలో చేరారు. అక్కడ దాదాపుగా చక్రం తిప్పారు. సమాజ్‌ వాదీ పార్టీ తరపున రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004 - 2009 ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జయప్రదను 2010లో సమాజ్‌ వాదీ పార్టీ బహిష్కరించింది. ఆ తర్వాత అమర్‌ సింగ్‌ తో కలిసి సొంత కుంపటి ఏర్పాటు చేసినా వర్కవుట్‌ కాలేదు. దీంతో.. చేసేది లేక కొన్నాళ్లు ఖాళీగానే ఉండిపోయింది. ఇప్పుడు ఎన్నికల సీజన్‌ కావడంతో.. బీజేపీ పార్టీలో చేరింది. మళ్లీ తనకు అచ్చొచ్చిన రాంపూర్‌ నుంచే పోటీ చేయబోతోంది.
   
పార్టీలు మారడం జయప్రదకు కొత్తేం కాదు. ఏ పార్టీలో ఉన్నా జయప్రద రాంపూర్‌ నుంచే పోటీ చేస్తుంది. జయప్రద సొంత ఊరు రాజమండ్రి. అయినా కూడా ఏపీ నుంచి పోటీ చేసేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. దానికి కొన్ని కారణాలున్నాయి. జయప్రద ప్రాంతీయ నాయకురాలు అన్పించుకోవడం కంటే జాతీయ స్థాయి నాయకురాలు అన్పించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. అందుకే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీలోనూ చేరదు. కాంగ్రెస్‌ లేదంటే బీజేపీ - లేదా ఇంకోటి తప్ప వేరే పార్టీ జోలికే వెళ్లదు. అన్నింటికి మించి స్టార్‌ హీరోయిన్‌ గా జయప్రదకు జాతీయ స్థాయిలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే. ఆమె జాతీయ స్థాయిలోనే పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో.. మన పార్టీలు కూడా జయప్రదను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి.


Tags:    

Similar News