జగన్ కు సీఎం పదవి..‘టీ’ పెద్దాయన మాట ఇది..

Update: 2017-02-22 07:27 GMT
తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతగా.. కేసీఆర్ లాంటి వ్యక్తి సైతం పెద్దాయనగా ఫీలయ్యే నేత ఎవరైనా ఉన్నారంటే అది.. జైపాల్ రెడ్డే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేని వేళ.. పవర్ లోకి వచ్చిన కేసీఆర్.. జైపాల్ ను రాజకీయంగా రెండు మాటలు అనేస్తున్నారు కానీ.. ఆయనంటే విపరీతమైన అభిమానమని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో జైపాల్ ప్రస్తావనను తరచూ తెచ్చే వారు కేసీఆర్. ఆయన కానీ తలుచుకుంటే తెలంగాణ ఇష్యూను తేల్చేస్తారని.. తాను ఢిల్లికి వెళ్లి పెద్దాయన్నుకలుస్తానని చెప్పే వారు.

అంతటి శక్తివంతుడైన జైపాల్.. కాలపరీక్షలో ఇప్పుడు సాదాసీదాగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర పేరు ప్రఖ్యాతులకు ఢోకా లేని జైపాల్ కు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఉన్న పట్టు అంతాఇంతా కాదు. దీనికితోడు స్టేట్ మెన్ అన్న పేరు ఆయన సొంతం. తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర అంశాల్నివెల్లడించారు.

జగన్ ను ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సి ఉందన్న మాటను చెప్పారు. అంతేనా.. జగన్ కేసుల గురించి.. దివంగత మహానేత వైఎస్ గురించి ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. వైఎస్ బతికి ఉన్నప్పటి కంటే.. మరణించిన తర్వాతే ఆయనపై సానుభూతి పెరిగిందన్న ఆయన.. ఆ పరిణామాన్ని గుర్తించటంలో కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు.. తమ లాంటి వాళ్లం కూడా విఫలమైన విషయాన్ని వెల్లడించారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలన్న అంశంపై కొంత మేరకైనా తాము గుర్తించి ఉంటే బాగుండేదన్న మాటను చెప్పిన జైపాల్.. మెజార్టీ ఎమ్మెల్యేల్లోనే కాదు.. ప్రజల్లో కూడా వైఎస్ కుటుంబం మీద భారీ సానుభూతి పెరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ పై కేసులు పెట్టటం.. జైలుకు పంపటం లాంటివి అప్రజాస్వామిక చర్యలు కాదా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన జైపాల్.. నాటి రాష్ట్ర రాజకీయాల్లో తాను లేనని.. రికార్డు ప్రకారం చూసినప్పుడు ఇవన్నీ కోర్టుల చొరవతో జరిగినట్లుగా తెలుస్తోందన్న ఆయన.. తనకు విషయం తెలీనప్పుడు తానేమీ చెప్పలేనని వ్యాఖ్యానించటం గమనార్హం. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాల్సి ఉందని.. కానీ.. మనమే పెట్టాం.. మన మాట వింటాడులేనన్న నమ్మకంతో ఉండేవారని. . కానీ ఆయన్ను సీఎంగా పెట్టటంలోనే తప్పు జరిగిందన్న అభిప్రాయానికి ఇప్పుడు వచ్చామన్నారు. కానీ.. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత అనుకున్నా ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News