జగన్ సంచలనం.. అవినీతిపై మంత్రులకు వార్నింగ్

Update: 2019-06-11 04:23 GMT
ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన నాడే అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్... తన తొలి కేబినెట్ సమావేశంలోనూ అదే మాటలను వల్లె వేశారు. అంతేకాకుండా తన కేబినెట్ లోని మంత్రులు అవినీతికి పాల్పడితే వెనువెంటనే వారిని మంత్రి పదవుల నుంచి తప్పించేస్తానని కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలోని సచివాలయంలో భేటీ అయిన తొలి కేబినెట్ భేటీలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవినీతికి పాల్పడిన మంత్రులు... ఆ అవినీతికి పాల్పడిన రోజే తమకు మంత్రిగా చివరి రోజుగా పరిగణించాలని ఆయన కాస్తంత కఠినమైన పదాలనే వాడారు. మంత్రులు స్వయంగా చేస్తేనే అవినీతి అనుకోరాదని, మంత్రుల పేర్లు చెప్పుకుని వారి బంధువులు, స్నేహితులు అవినీతికి పాల్పడినా కూడా ఆ అవినీతికి మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా జగన్ డేంజర్ బెల్స్ మోగించారు. టీడీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలను ఓ సారి ప్రస్తావించిన జగన్... అలాంటి పరిస్థితి పునరావృతం కారాదన్న కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. తన మంత్రివర్గంలోని మంత్రులెవరికీ అవినీతి మరక అంటరాదన్న కోణంలో జగన్ తనదైన శైలి ఆంక్షలను విదించుకుంటూ సాగుతున్నారు.

ప్రజలకు ఏం చెప్పామో, దానిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని, అప్పుడే ప్రజలకు తమపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసినట్లు అవుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సందర్బంగా అవినీతికి పాల్పడే మంత్రులకు ఆ విషయాలు బయటపడే రోజే మంత్రిగా చివరి రోజని చేసిన వ్యాఖ్య నిజంగానే మంత్రుల వెన్నులో వణుకు పుట్టించిందని చెప్పక తప్పదు. మరి జగన్ కఠిన నిర్ణయాలతో, కఠోర దీక్షతో ముందుకు సాగుతుండగా... ఆయన ఎంపిక చేసుకున్న మంత్రులు కూడా అదే రీతిన సాగక తప్పదని, అలా కాని పక్షంలో తాను ఎంపిక చేసుకున్న వారిని జగన్ అప్పటికప్పుడు దూరం చేసుకునేందుకు కూడా వెనుకాడబోరన్న వాదన వినిపిస్తోంది.

Tags:    

Similar News