ఒక్క మాటతో బాబును హడలెత్తించిన జగన్

Update: 2018-01-22 17:10 GMT
దావోస్‌ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కడి అతి శీతల వాతావరణంలో కూడా చెమటలు పట్టే ఘటన ఒకటి తాజాగా జరిగింది. వైసీపీ అధినేత జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఒక ప్రతిపాదన వెంటనే టీడీపీ సీనియర్ల ద్వారా చంద్రబాబుకు చేరడంతో ఆయనకు అక్కడ చెమటలు పడుతున్నాయట. ఇంతకీ జగన్ అన్న ఆ మాటేంటో తెలుసా..‘‘ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలుస్తా’’.. ఈ మాటే చంద్రబాబును హడలగొట్టింది.
    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే రానున్న 2019 ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ… హోదా హామీ నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా బీజేపీతో అడుగులు వేస్తామన్నారు. ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం అంతగా లేదన్న ఆయన బీజేపీతో కలుస్తామని సంకేతాలివ్వడంతో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు తథ్యమా అన్న చర్చ మొదలైంది.
    
కాగా.... జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అటు టీడీపీ నేతలే కాకుండా చావచచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్లోనూ కంగారు మొదలైనట్లు అర్థమవుతోంది. బీజేపీ - వైసీపీ కలిస్తే  అంతంతమాత్రంగా ఉన్న ఆశలు కూడా వదులుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ నేత జేడీ శీలం విమర్శలు చేశారు. జగన్ ను బీజేపీ బెదిరించిందని … కేసులకు భయపడే జగన్ బీజేపీతో కలుస్తానని సంకేతాలిచ్చారని శీలం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా… బీజేపీతో కలుస్తామనడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
Tags:    

Similar News