బాలయ్య ది బెస్ట్ అనేసిన జగన్

Update: 2017-03-23 07:04 GMT
రాజకీయాల్లో పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్లకు కూడా సినిమాలంటే ఇష్టం ఉంటుంది. వాళ్లకు కూడా కొందరు హీరోలంటే పిచ్చి అభిమానం ఉంటుంది. యంగ్ ఏజ్ లో ఉన్నపుడు ఆ హీరోను ఆరాధించి ఉంటారు. రాజకీయాల్లో ఎదిగాక ప్రయారిటీస్ మారిపోయినప్పటికీ.. తమ హీరో మీద అభిమానం మాత్రం చంపుకోలేరు. సందర్భం వచ్చినపుడు ఆ అభిమానాన్ని చాటుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కోవకే చెందుతారు. జగన్ కు నందమూరి బాలకృష్ణ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. యుక్త వయసులో ఉన్నపుడు బాలయ్యకు వీరాభిమానిగా ఉన్నాడు జగన్. రాజకీయాల్లో బిజీ అయ్యాక.. బాలయ్య తమ వైరి వర్గం అని తెలిసినా జగన్ అభిమానాన్ని తీసి పక్కన పెట్టేయలేదు.

తాజాగా జగన్.. బాలయ్యకు హీరోగా కాకుండా ఎమ్మెల్యేగా మంచి మార్కులు వేయడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో పనితీరు పరంగా బాలయ్యే ది బెస్ట్ అని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అసెంబ్లీ బయట పిచ్చాపాటిగా మాట్లాడుతూ బాలయ్య మీద ప్రశంసలు కురిపించాడు జగన్. బాలయ్య ఒకరిని విమర్శించరని.. లేనివి మాట్లాడరని.. మంచి మాటలే మాట్లాడతారని జగన్ కితాబిచ్చారట. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరిలోకి బాలయ్యే ది బెస్ట్ అని కూడా జగన్ తీర్మానించారట. తమ పార్టీలో.. నియోజకవర్గంలోని జనాల్లో ఎమ్మెల్యేగా బాలయ్య పనితీరుపై ఎలాంటి అభిప్రాయం ఉందో కానీ.. స్వయంగా ప్రతిపక్ష నేతే బాలయ్యకు ఇలా కితాబివ్వడం విశేషమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News