బాబు అక్రమాలు.. నిపుణుల కమిటీతో జగన్ భేటి..

Update: 2019-06-22 08:39 GMT
చంద్రబాబు హయాంలో ఇష్టానుసారం సాగిన పనులు.. ఇంజనీరింగ్ అవకతవకలపై గద్దెనెక్కగానే విచారణ చేయిస్తానని ప్రకటించిన ఏపీ సీఎం జగన్ అన్నట్టే ఓ విచారణ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై 8 మంది సభ్యులతో కమిటీని జూన్ 14న ఏర్పాటు చేశారు. విచారణ జరిపి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జగన్ ఆదేశించారు.

జలవనరుల శాఖ చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ (సీటీఈ) ఈ కమిటీకి కన్వీనర్. రిటైర్డ్ సీఈలు - ఈఎన్ సీలు - స్ట్రక్షరల్ ఇంజనీర్స్  - ఏపీ జెన్ కో రిటైర్డ్ డైరెక్టర్లు - సీడీవో రిటైర్డ్  సభ్యులను జగన్ ప్రభుత్వం నియమించింది. అయితే విచారణ వేగవంతానికి ఈ కమిటీ ఆనాడే మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. జలవనురుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ కమిటీలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రధానంగా ఈ కమిటీ చంద్రబాబు ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ లో లోపాలు, రహదారులు, భవనాలశాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడింది నిగ్గుతేల్చి సీఎం జగన్ కు నివేదిక అందజేస్తుంది.

తాజాగా చంద్రబాబు అక్రమాలు నిగ్గుతేల్చడంతోపాటు గతంలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి అంచనాలపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు నిపుణుల కమిటీ సభ్యుడు సూర్యప్రకాష్ తెలిపారు. 15 రోజుల్లోనే జగన్ సమావేశం ఉందని.. గత ప్రభుత్వంలోని లోపాలపై నివేదిక సిద్ధమవుతుందని తెలిపారు. దీంతో 15 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడే చాన్స్ ఉంది. ఈ వ్యవహారం ప్రతిపక్ష టీడీపీని తీవ్రంగా కలవరపెడుతోంది.


Tags:    

Similar News