వైసీపీ ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ కొత్త రాజ‌కీయం

Update: 2016-05-31 05:20 GMT
వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్ త‌న రాజ‌కీయాల‌కు ప‌దును పెడుతున్నారు. మరో పదకొండు రోజుల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై  వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకుని, తన పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ విసిరే వలలో పడకుండా, వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తున్న నేపథ్యంలో తన అభ్య‌ర్థి  విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలకు దొరక్కుండా వారిని ఇప్పటికే రాష్ట్రం నుంచి తరలించారు.

తన పార్టీకి చెందిన మరో 19 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కసరత్తును దృష్టిలో ఉంచుకున్న జగన్, ముందు జాగ్రత్తగా తన ఎమ్మెల్యేలను సురక్షిత శిబిరాలకు తరలించారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న 11వ తేదీ వరకూ తన పార్టీ ఎమ్మెల్యేలను అమెరికా - శ్రీలంక - దుబాయ్ - ఊటీ - బెంగళూరుకు జ‌గ‌న్ తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ముందు రోజు వరకూ వారిని అక్కడే ఉంచే ఏర్పాట్లు చేశారు. కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌ లో ఉన్నారంటూ టీడీపీ నేత‌లు చెప్తున్న విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందు వారితో ఏకాంతంగా మాట్లాడి, మీకు అండ‌గా ఉంటాన‌ని జగన్ హామీ ఇచ్చారు. దానితోపాటు, వారి ‘సమస్య’లను పరిష్కరించే బాధ్యతను రాజ్యసభ అభ్యర్ధి విజయసాయిరెడ్డికి అప్పగించారు. దాంతో విజయసాయిరెడ్డి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి - కరుణాకర్‌ రెడ్డి వంటి సీనియర్లను వెంటబెట్టుకుని తన పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు స్వయంగా వెళ్లి వస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి - ఆయన ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను పరిష్కరించారు. ఈవిధంగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి, వారి వద్దకు విజయసాయిని పంపించారు. ఒకవేళ వరకూ, టీడీపీ నాలుగవ అభ్యర్ధిని నిలబెట్టకపోతే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. అప్పటివరకూ ఎమ్మెల్యేలను ‘క్యాంపు’లోనే ఉంచే ఏర్పాట్లు చేశారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు అంతకుముందే అమెరికా - దుబాయ్ వెళ్లారు. వారిలో కొందరు కుటుంబాలతో వెళ్లారు.

Tags:    

Similar News