బాబును ఏం చేయాలని అడుగుతున్న జగన్

Update: 2016-07-19 04:30 GMT
రోజులు గడుస్తున్నా అధికారపక్ష అధినేతపై పట్టు చిక్కటం లేదో ఏమో కానీ.. ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసహనం పెరిగిపోతోంది. ఇందుకు ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి. ఏపీ అధికారపక్షం తీరును ఎండగడుతూ.. తాజాగా చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో  భాగంగా జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా మునగపాకతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? ఎన్నికలయ్యాక ఏం చేస్తున్నాడు? అంటూ ప్రశ్నించిన జగన్.. ఎన్నికల సమయంలో ఏ ఒక్కరిని విడిచి పెట్టకుండా హామీలు ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్ని నెరవేర్చటం లేదన్నారు.

పవర్ లోకి వచ్చిన తర్వాత చేసిన హామీల్ని మర్చిపోయే చంద్రబాబు నాయుడ్ని ఏం చేయాలి?అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని బాబు అమలు చేసే దాకా పోరాటం చేస్తామని.. అందులో భాగంగానే గడప గడపకూ వైఎస్ కాంగ్రెస్ కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. ‘‘ప్రజలకు మేలు చేయని ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేశారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. ఎవర్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు హామీలు ఇచ్చారు. అబద్ధాలతో ముఖ్యమంత్రి అయ్యారు. చివరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. అబద్ధాలతో చంద్రబాబు రాజకీయ వ్యవస్థను దిగజార్చారు’’ అని మండిపడ్డారు.

ఈ కారణాలతోనే తాము చేపట్టిన తాజా కార్యక్రమం గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో బాబు ప్రభుత్వానికి మార్కులు వేయమన్నామని కోరుతున్నట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి అయితే ఏం చేసినా నడుస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారని.. రాజకీయ వ్యవస్థ మారాలంటే ఇలాంటి వ్యక్తిని నిలదీయాలన్న జగన్.. అప్పుడు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు.
Tags:    

Similar News