జగన్ కౌంటర్ తో ‘పవనాస్త్రం’ వృథాయేనా?

Update: 2018-02-13 15:30 GMT
పవన్ కల్యాణ్ ఎన్ని కబుర్లు అయినా చెప్పవచ్చు గాక.. కానీ పవన్ భక్తి పరిమితంగా ఉండే ప్రజల్లో మాత్రం ఆయన వైఖరి మీద ఎంతో కొంత అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రేరణతోనే ఆయన ప్రస్తుతం నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసి.. మరక అంటుకోకుండా.. అందులో తాను ఉండబోవడం లేదంటూ సెలవిచ్చి.. వ్యవహారం నడిపిస్తున్నట్టు కూడా అనుమానించే వాళ్లు అనేకమంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ ఇప్పటికీ చంద్రబాబు చేతిలో అస్త్రమే అయినట్లయితే గనుక.. ఆ అస్త్రాన్ని ఇప్పుడు పనిచేస్తున్న రూపంలో ప్రయోగించడం ద్వారా ఆశిస్తున్న ప్రయోజనాన్ని చంద్రబాబు కోల్పోయినట్లే. ఆ విషయంలో వైఎస్ జగన్ ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మీద స్పష్టమైన పైచేయి సాధించారు. చంద్రబాబు పవనాస్త్రం వృథా అవుతుందేమో అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది.

పవన్ ఎంత దూరం నిజనిర్ధారణ చేయించినా సరే.. కేంద్రం చెబుతున్న నిధుల విడుదల మాటలు - రాష్ట్రం చెబుతున్న బకాయిల వ్యవహారం తప్ప మరొకటి తేలే అవకాశం లేదు. ఆయన అసలు ప్రత్యేకహోదా అనే మాట కూడా తమ చర్చల్లోకి రానివ్వడం లేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వలన రాష్ట్రం అనుకున్నది చేయలేకపోతున్నది అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లాలనే కోరిక తప్ప మరొక ఎజెండా చంద్రబాబుకు లేదు. పవన్ నిజనిర్ధారణ ద్వారా ఆ కోరిక సంపూర్ణంగా తీరుతుంది.

ఒకవైపు ఇలాంటి వ్యూహరచన జరుగుతుండగా.. వైఎస్ జగన్ ‘‘ప్రత్యేకహోదా మన హక్కు ’’ అనే నినాదాన్ని తాజాగా తారస్థాయికి తీసుకువచ్చారు. ఇదివరకటి కంటె నిన్నటినుంచి తన  పాదయాత్రలో మరింత జోరుగా ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు. పార్టీ తరఫున ఉద్యమాలకు ప్రణాళిక ప్రకటించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా సహా.. ఏప్రిల్ 6 లోగా తేలకుంటే రాజీనామాలను కూడా ప్రకటించేశారు. ఇలాంటి వన్నీ జరుగుతాయా? లేదా? అనే అంశం తరువాత... కాకపోతే.. ప్రజలందరికీ ఇప్పుడు ప్రత్యేకహోదా కూడా తమ హక్కు అనే స్పృహ కలగడానికి ఈ పోరాటాలు ఉపయోగపడతాయి. ప్రత్యేకహోదా వల్ల.. రాష్ట్రం బాగుపడుతుంది అనే అవగాహన వారికి కలుగుతుంది. ఇటు తెదేపాగానీ - పవన్ గానీ ఆ అంశాన్ని మాట్లాడే సాహసం చేయడం లేదు. దీంతో వారు ఏం మాట్లాడినా సరే.. ప్రజలకు దాని మీద పెద్దగా శ్రద్ధ ఉండకపోవచ్చు. ఆ రకంగా పవన్ చేస్తున్న ప్రయత్నం గురించి ఎవ్వరూ పట్టించుకునే అవకాశం లేకుండపోతుంది. ఇలా వ్యూహాత్మకంగా జగన్ దెబ్బకు ... పవన్ కల్యాణ్ ఎఫర్ట్ నీరుగారుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News