జ‌గ‌న్ స్కెచ్‌ లో రెండో ఎపిసోడ్ ఇది

Update: 2016-09-07 17:30 GMT
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ దిశగా వ్యూహాలను పదునుపెడుతోంది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయడంతోపాటు పార్టీ బలోపేతం చేసేందుకు వివిధ మార్గాల్లో పయనించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు - టీడీపీలో అసంతృప్తితో ఉన్న నేతలకు గాళం వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సీనియర్ నేతలు ఎవరు ఉన్నారు, టీడీపీలో అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరు ఉన్నారు అన్న దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతల ద్వారా ఆ ప్రయత్నాలు మమ్మురం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలే ప్రస్తుతం ఉన్న విషయం తెలిసిందే. వై.ఎస్. తనయుడిగా కొత్త పార్టీని జగన్ ప్రారంభించిన సమయంలో టీడీపీ - కాంగ్రెస్ - బీజేపీ కొన్ని చోట్ల వామపక్ష పార్టీల నుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయా నేతలకు ఇప్పటికే ఉన్న పలు పార్టీలలోని నేతలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పార్టీలోని నేతలతో ఇతర పార్టీలలో ఉన్న బలమైన నేతలకు గాళం వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది రాష్ట్రంలో ఉన్న ఏకైక బలమైన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, తమ పార్టీ వైపు మొగ్గుచూపేందుకు ఇది మార్గం అవుతుంద‌ని చెప్తున్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభంజనంలా దూసుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ ఓటమిపై సమీక్ష చేసుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొన్ని చోట్ల బలహీనమైన నాయకత్వం వల్లే ఓడారన్న అంచనాకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిపిన పలు సర్వేల్లో మాత్రం తమ పార్టీకే అనుకూల నివేదికలు వచ్చాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. కానీ ఈ ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో ఎన్నికలకు ముందే జగన్ కొందరికి మాట ఇవ్వడం జరిగిందని వారు గుర్తుచేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగడంతో ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొందరు ప్రత్యామ్నాయ బాట పట్టారు. ఆ సమయంలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసినా తమ నాయకత్వం పట్టించుకోకపోవడం వల్ల వారు టీడీపీ వైపు మళ్లారు. అలా తమ పార్టీ వైపు చూసి టిక్కెట్టుపై హామీ దక్కని వారు టీడీపీలోకి వెళ్లి అక్కడ మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారని పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీంతో పలు జిల్లాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన ఫలితాలు రాలేదని పేర్కొంటున్నారు. ఇదే అంచనాకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు ఆ నష్ట నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఎక్కడెక్కడా ఎక్కువ సీట్లు కోల్పోయిందన్న అంచనా వేసి  ఆ స్థానాలలో ఇప్పటికే బలంగా ఉన్న నేతలెవ్వరూ అన్న దిశగా అన్వేషణను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఇంకా కొందరు ఆ పార్టీలోనే అసంతృప్తితో కొనసాగడంతో వారిని తమవైపు లాగాలని వైసిపి సమాలోచనలు చేస్తోంది.

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకొన్నమేర ఫలితాలను సాధించలేదు. అదే సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలలోనూ - శ్రీకాకుళం - విజయనగరం - వైజాగ్ తదితరజిల్లాలలో మెరుగుపడాలని వైసీపీ భావిస్తోంది. దీంతో ఈ జిల్లాలలో బలంగా ఉన్న నేతలపై ఆ పార్టీ దృష్టిసారించిది. ఈ క్రమంలో ఇప్పటికే బొత్స సత్యనారాయణను తన పార్టీలో చేర్చుకొన్న వైసీపీ ఆయనకు విశాఖజిల్లా బాధ్యతలు ఆయనకు అనధికారికంగా అప్పగించిన‌ట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకొచ్చే విషయంలో ధర్మాన బ్రదర్స్ కృషియే తోడ్పడిందని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ తరహాలోనే తన పార్టీలోని సీనియర్ నేతల పరిచయాలతో వివిధ జిల్లాలలో ఇతర పార్టీలలోని సీనియర్ - బలమైన నేతలకు గాళం వేయాలని వైసిపి భావిస్తోంది. ఇందుకోసం అనంతపురం - విశాఖ - ఉభయ గోదావరి - విజయనగరం - శ్రీకాకుళం జిల్లాలపై వైసీపీ నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ ను అంతర్గతంగా ప్రవేశపెట్టిన వైసీపీ నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెటు గ్యారెంటీ అన్న హామీతో గాళం వేయాలని సమాలోచనలు చేస్తోంది. బలమైన నేతలు వచ్చే అవకాశమున్న చోట అప్పటికే అక్కడ ఉన్న పార్టీ నేతలను ఇతర పదవులు ఇచ్చి సంతృప్తి పరిచే చర్యలు కూడా చేపట్టాలని వైసిపి యోచిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల వల్ల పార్టీలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతల నుంచి ఇబ్బందులు కూడా రాకూడదని ఆ పార్టీ సమాలోచనలు చేస్తోంది.
Tags:    

Similar News