35 మంది టీఆర్ఎస్ సిట్టింగ్‌ ల ఓటమికి కారణం అదేనా ?

Update: 2020-12-05 05:56 GMT
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ ‌ఎస్‌ పార్టీకి వరద దెబ్బ గట్టిగానే తగిలింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక  2016లో నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా అర్ధ సెంచరీకి అటు ఇటుగా నిలిచింది. 48 స్థానాలు గెలుచుకొని అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించింది.

అయితే, గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ నుండి  గెలిచిన 99 మందిలో 72 మందికి మరోసారి పోటీకి అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇందులో 35 మంది ఓడిపోయారు. వీరిలో కొందరు మూడోసారి పోటీ చేయగా, కొందరు రెండోసారి బరిలోకి దిగారు. చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, అధిష్ఠానం వారిని నమ్మి బరిలోకి దించింది. ఇదే ఇప్పుడు కొంప ముంచిందన్న అభిప్రాయం రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

అంబర్ ‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉండగా.. నల్లకుంట, బాగ్ ‌అంబర్‌ పేటలో సిట్టింగ్‌లు గరిగంటి శ్రీదేవీరమేష్‌, పద్మావతిరెడ్డిలకు అవకాశం ఇచ్చారు. వారిద్దరూ  ఓటమి చవిచూశారు.  సనత్‌ నగర్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో నాలుగు చోట్ల సిట్టింగ్‌ లను బరిలో నిలిపారు. అమీర్ ‌పేట నుంచి శేషుకుమారి, రాంగోపాల్‌ పేట సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణగౌడ్‌ లు ఓటమి చెందారు. మరో ఇద్దరు విజయం సాధించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగ్ ‌లకు మరో చాన్స్‌ ఇచ్చారు. రాంనగర్‌, ముషీరాబాద్‌, అడిక్‌ మెట్‌, గాంధీనగర్‌, కవాడిగూడలో శ్రీనివాస్ రెడ్డి, ఎడ్లభాగ్యలక్ష్మి, హేమలత, పద్మ, లాస్య నందితలు ఓటమి పాలయ్యారు.

గోషామహల్‌ లోని ఆరు డివిజన్లలో మూడు చోట్ల సిట్టింగ్ ‌లు బరిలో నిలిపారు. మంగళ్ ‌హట్‌, గన్‌ ఫౌండ్రి, గోషామహల్‌ నుంచి పరమేశ్వరీసింగ్‌, మమతాగుప్తా, ముఖేష్ సింగ్ ‌లు పరాజయం పాలయ్యారు. ఎల్ ‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా, టీఆర్‌ ఎస్‌ ఖాతాలోని 10 స్థానాల్లో సిట్టింగ్‌ లకు అవకాశమిచ్చారు. వారంతా ఓడిపోయారు.  ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చారు. రామంతాపూర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, ఏఎస్ ‌సరావునగర్ ‌లో ప్రస్తుత కార్పొరేటర్లుగా ఉండి మళ్లీ బరిలో నిలిచిన వారు ఓటమి పాలయ్యారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఐదు చోట్ల సిట్టింగ్ ‌లకు అవకాశం ఇవ్వగా, జూబ్లీహిల్స్‌, హిమాయత్‌ నగర్‌ డివిజన్లలో ఖాజా సూర్యనారాయణ, ప్రేమలతలు పరాజితులయ్యారు. మలక్‌ పేట నియోజకవర్గంలో సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, ముసారాంబాగ్‌ ల నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌లు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, సామ స్వప్న, సునరితారెడ్డిలు ఓటమి పాలయ్యారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆరుగురు సిట్టింగ్‌ లకు అవకాశం ఇవ్వగా, మూసాపేటలో తూము శ్రవణ్‌ కుమార్‌ ఓడిపోయారు. కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో ఏడుగురు సిట్టింగ్‌ లను మళ్లీ బరిలో నిలపగా, జీడిమెట్ల సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పద్మ పరాజయం పాలయ్యారు. ఖైరతాబాద్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ కు పట్టం కట్టిన ఓటర్లు ఈ సారి బీజేపీ వైపు మొగ్గు చూపించారు.
Tags:    

Similar News