కీలక పదవిని పవార్ చేతికి అప్పజెప్పబోతున్నారా?

Update: 2020-12-11 06:47 GMT
పొట్టి చేసి చెప్పాలంటే యూపీఏ.. కాస్త దాన్ని వివరంగా చెప్పాలంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు కలిపి సోనియాగాంధీ సారథ్యంలో.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటూ పదేళ్ల పాటు అధికారంలో ఉండటం తెలిసిందే. మోడీ ఎంట్రీతో యూపీఏ అధికారం చేజారటం.. ఆ తర్వాత ఈ శక్తివంతమైన రాజకీయ పక్షం బలహీనమైపోవటం తెలిసిందే.

ఇప్పటివరకు యూపీఏకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సారధ్యం వహించారు. ఇప్పుడా పార్టీ సొంత పార్టీనే సరిగా నడపలేని దుస్థితిలో ఉంది. ఇలాంటివేళలో.. యూపీఏకు సారధ్యం వహించటంఅంత సులువు కాదు. అందుకే.. యూపీఏ ఛైర్ పర్సన్ పదవికి సోనియా దూరం కానున్నారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం ఏ మాత్రం బాగోకపోవటం.. ఈ మధ్యనే గోవాకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు.

బీజేపీ పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఎన్డీయేలోని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్న నేపథ్యంలో.. యూపీఏను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బావిస్తున్నారు. అందుకే.. కాంగ్రెసేతర నాయకులు ఎవరైనా యూపీఏకు రథసారధిగా వ్యవహరిస్తే మార్పు ఉంటుందని భావిస్తున్నారు.

ఇందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అయితే సరిపోతారన్న మాట వినిపిస్తోంది. అయితే.. యూపీఏ ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు పవార్ సిద్ధంగా లేరన్న విషయాన్ని పార్టీ స్పష్టం చేసింది. యూపీఏలో ఉన్న మిత్రపక్షాల మధ్య ఇలాంటి చర్చలేమీ జరగలేదని పేర్కొంది. మీడియాలో వస్తున్నట్లుగా శరద్ పవార్.. యూపీఏ ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు సిద్దంగా లేరన్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని శివసేన నాయకత్వంలో కాంగ్రెస్.. ఎన్సీపీలతో కూడిన మిత్రపక్షం ఏర్పాటు చేయటం తెలిసిందే. వైరుధ్యంతో కూడిన ఈ మిత్రపక్షం సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వేళ.. యూపీఏ ఛైర్మన్ పదవిని పవార్ చేపడతారన్న ప్రచారం సాగుతోంది. మరేం జరుగుతుందో కాలమే బదులివ్వాలి.
Tags:    

Similar News