టీడీపీతో కేశినేని నానికి సంబంధం లేదా ?

Update: 2022-06-25 06:51 GMT
విజయవాడ తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు బాగా పెరిగిపోతున్నాయి. ఎంపీ కేశినేని నాని ఒకవైపు ఆయనకు వ్యతిరేకంగా ముగ్గురు సీనియర్ నేతలు మరోవైపు మోహరించడం తో ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య ఎందుకో కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం నాని తాజా ప్రకటనతో ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కబోతోంది. శుక్రవారం పార్టీ ఆఫీసులో చంద్రబాబునాయుడును కలిసి ఎంపీ చాలాసేపు మాట్లాడారు. వాళ్ళ మధ్య మంతనాలు ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు.

అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎంపీ మాట్లాడుతూ తాను ఏ ఒక్క పార్టీకి పరిమితమైన ఎంపీని కానని చెప్పారు. టీడీపీ తరపున గెలిచిన ఎంపీ సహజంగా టీడీపీ ఎంపీయే అవుతారనటంలో సందేహం అవసరంలేదు.

కానీ నాని మాత్రం తాను టీడీపీ ఎంపీని మాత్రమే కానని అసలు ఏ పార్టీకి చెందని ఎంపీనని ప్రకటించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తన శతృవును చంద్రబాబు ప్రోత్సహిస్తే చంద్రబాబు శతృవును తాను ప్రోత్సహిస్తానని చెప్పినట్లు ఎంపీ మీడియాతో చెప్పటమే విచిత్రంగా ఉంది.

మీ ఇంటికి తనిల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమని తాను చంద్రబాబుతో స్పష్టం చేసినట్లు ఎంపీ చెప్పారట. ఇదంతా ఎందుకొచ్చిందంటే ఎంపీ సోదరుడు కేశినేని శివనాధ్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తుండమే కారణమట. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని చంద్రబాబు ప్రోత్సహించటం ఏమిటనేది ఎంపీ లాజిక్.

అంతా బాగానే ఉందికానీ అసలు పార్టీలో తాను యాక్టివ్ గా ఉంటే పార్టీ అధినేత ఎంపీ సోదరుడిని ప్రోత్సహించాల్సిన అవసరమే రాదుకదా అనే ప్రశ్నకు నాని సమాధానం చెప్పడం లేదు. ఎంపీ అసలు పార్టీలో ఉన్నారా లేదా కూడా చాలామందికి అనుమానమే. ఎందుకంటే నెలల తరబడి పార్టీ కార్యక్రమాల్లో అసలు కనబడరు.

తన కార్యాలయం ముందున్న ఫ్లాక్సీల్లో తన ఫొటో మాత్రమే పెట్టుకున్న ఎంపీ చంద్రబాబు ఫొటోలను కూడా తీసేయించారు. ఇలాంటి అనేక చేష్టలతోనే నాని పార్టీలో ఉన్నారా లేదా అనే సందేహాలు పెరిగిపోయాయి. పార్టీలోనే ఉంటున్నది నిజమే అయితే, పార్టీలో కంటిన్యు అయ్యే ఉద్దేశ్యముంటే నాని ఈ విధంగా వ్యవహరించరు. అందుకనే చంద్రబాబు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు.
Tags:    

Similar News