రూ.2-3లక్షల కోట్ల ఆస్తిని జగన్ నాశనం చేస్తున్నారట!

Update: 2020-08-15 08:50 GMT
ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటు దిశగా జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. ప్రస్తుతం  కోర్టు ఈ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మూడు రాజధానుల వ్యవహారం ఆగింది. మూడు రాజధానుల ఏర్పాటును పెద్ద ఎత్తున వ్యతిరేకించే వారు ఉన్నట్లే.. ఆ కాన్సెప్టును మద్దతు ఇచ్చే వారు లేకపోలేదు. ఇదిలా ఉండగా.. మూడు రాజధానుల ఏర్పాటు కారణంగా ఏపీకి జరిగే నష్టం మీద విపక్ష నేత చంద్రబాబు ఆసక్తికర వాదనను వినిపించారు.

ఒకసారి అమరావతి నగర నిర్మాణం పూర్తి అయితే.. దాని విలువ రూ.2-3 లక్షలకోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అంతటి సందపను మూడు రాజధానుల ఏర్పాటుతో నాశనం చేసుకున్నట్లు అవుతుందని చెప్పారు. రాజధాని లేకుండా ఉత్త చేతలతో బయటకు వచ్చిన ఏపీ ప్రజలకు.. ఒక అధునాతన నగరాన్ని నిర్మించుకునే అవకాశం వచ్చిందన్నారు.

అమరావతిని నాశనం చేయటమంటే.. రూ.2-3లక్షల సంపదను పోగొట్టుకున్నట్లేనని చెప్పారు. రాష్ట్రం కోసం అమరావతి తప్పించి.. అమరావతి కోసం రాష్ట్రం కాదన్నారు. ఏదైనా జాతీయ రహదారి పక్కన నాలుగైదు వందల ఎకరాల్లో రాజధానిని నిర్మించటం పెద్ద సమస్య కాదని.. దాని వల్ల ఉద్యోగాలు.. ఉపాధి ఎలా లభిస్తాయని ప్రశ్నిస్తున్నారు.

అమరావతిలో మౌలిక వసతులు.. ప్రభుత్వపాలనా భవనాల.. కొన్ని నగరాలు నిర్మించాలని.. అందుకు రూ.50వేల కోట్లు ఖర్చు కావొచ్చంటున్నారు. కొన్ని రకాల పన్నుల ద్వారా ఖర్చు చేసిన మొత్తంలో 50 శాతం వరకు తిరిగి ప్రభుత్వానికి వచ్చే వీలుందన్నారు. ప్రైవేటు నిర్మాణాల కారణంగా కొంత డబ్బువస్తుందని చెప్పారు. రైతులకు ఇవ్వా్లసిన భూమి పోనుప్రభుత్వానికి 8 వేల ఎకరాల భూమి మిగులుతుందని.. అమరావతి విలువ పెరిగిన తర్వాత.. ప్రభుత్వానికి ఆ భూముల కారణంగా రూ.లక్ష కోట్లు వస్తాయన్నారు.

చేతిలో ఉన్న సంపదను పాడు చేసుకొని కేంద్రాన్ని రూ.9.90లక్షల కోట్లు ఇవ్వాలని కోరుతున్నారని.. అలా చేస్తే మనల్ని ఎవరు పట్టించుకుంటారన్నది చంద్రబాబు సందేహం. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే వేల కోట్లు ఖర్చుచేశామని.. అలాంటి వేళ మరో చోటుకు పోవాలనుకోవటం తుగ్లక్ చర్య కాక మరేమిటి? అని ప్రశ్నించారు.

రాజకీయ క్రీడకు ఇది సరైన సమయమా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. దేశంలో ఎక్కడైనా ఇలా మార్చారా? అని నిలదీశారు. ప్రస్తుతం ఏ నగరంలో అయినా మంచినీటి పైపు వేయాలంటే రోడ్లు తవ్వుకుంటూ వెళ్లాలని.. కానీ అమరావతిలో మాత్రం రోడ్డు తవ్వే పనే లేకుండా.. రోడ్డు పక్క నుంచి వెళ్లటానికి వీలుగా డక్టులు నిర్మించిన విషయాన్ని వెల్లడించారు. తన వాదనకు తగిన ఆధారాలు చూపిస్తూ మాట్లాడిన చంద్రబాబుకు సీఎం జగన్ ఏ రీతిలో సమాధానం చెబుతారో చూడాలి.
Tags:    

Similar News