నాగార్జున సాగ‌ర్‌ లో బీజేపీ అభ్య‌ర్థి అత‌నేనా?

Update: 2020-12-07 06:21 GMT
తెలంగాణ‌లో మ‌రో కీల‌క ఉప ఎన్నిక రానుంది. ఇప్ప‌టికే దుబ్బాక‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప పోరులో బీజేపీ గెలుపు గుర్రం ఎర్కింది. ఇక‌, త్వ‌ర‌లోనే నాగార్జున‌సాగ‌ర్‌.. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉప ఎన్నిక రానుంది. ఇక్క‌డ నుంచి గ‌త 2018 ఎన్నిక‌ల్లో మాజీ క‌మ్యూనిస్టు.. త‌ర్వాత టీఆర్ ఎస్ గూటికి చేరిన నోముల న‌ర‌సింహ‌య్య గెలుపు గుర్రం ఎక్కారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ మంత్రి జానా రెడ్డి ఏడువేల ఓట్ల‌తో ఓడిపోయారు. అయితే, ఇటీవ‌ల నోముల తీవ్ర అనారోగ్యంతో క‌న్ను మూశారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక రానుంది. వాస్త‌వానికి నోముల‌కు ఈ నియోజ‌క ‌వ‌ర్గం స్థానికం కాదు. అయినా.. టీఆర్ ఎస్ వేవ్‌లో విజ‌యంసాధించారు. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ప‌రిస్థితి ఏంటి?

మ‌రీ ముఖ్యంగా దుబ్బాక గెలుపు, గ్రేట‌ర్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ ఇక్క‌డ కూడా త‌న స‌త్తా చాటు తుందా?  లేక ఆ రెండు చోట్లా పాల‌పొంగు మాదిరిగా పొంగినా.. ఇక్క‌డ చ‌తికిల ప‌డుతుందా? అనేది ఆస‌క్తి క‌రంగా మారింది. ఇక‌, బీజేపీ నేత‌లు ఇప్ప‌టి నుంచే ఇక్క‌డ అభ్య‌ర్తి కోసం వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా జానా కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునేందుకు ఎత్తుగ‌డ వేస్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది క‌నుక‌.. జానాను బీజేపీలోకి ఆహ్వానించి.. ఆయ‌న‌తో రిమైర్మెంట్ ప్ర‌క‌టించేసి.. ఆయ‌న కుమారుడు ర‌ఘువీర్‌కు టికెట్ ఇవ్వాల‌నేది రాష్ట్ర క‌మ‌ల‌నాథుల ఆలోచ‌న‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రి ఈ ప్ర‌తిపాద‌న‌కు జానా ఏమంటారు? అనేది కీల‌కంగా మారింది. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నారు. తొలుత టీడీపీ త‌ర్వాత కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పారు. మంత్రి ప‌ద‌వులు కూడా అందుకున్నారు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు కాంగ్రెస్ అవ‌సాన ద‌శ‌లో ఉంద‌ని వంక చూపుతూ.. బీజేపీలో చేరితే ప్ర‌జ‌ల్లో ఎలాంటి సందేశం ఇచ్చిన‌ట్టు అవుతుంది? అనేది జానా ఆలోచ‌నగా ఉంద‌ని అంటున్నారు. ఇది త‌న ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రేపు జానా క‌మలం గూటికి వెళ్ల‌డం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ మ‌రో దారి కూడా వెతుకు తోంది.

2018 నుంచి టీఆర్ ఎస్‌లో ఉన్న జానా రెడ్డి ముఖ్య అనుచ‌రుడు ఎంసీ కోటి రెడ్డిని త‌మ‌వైపు తిప్పుకోవాల ని భావిస్తోంది. కోటి రెడ్డి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని అనుకున్నారు. అయితే.. నోముల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకున్న టీఆర్ ఎస్ కోటిరెడ్డిని బుజ్జ‌గించింది. సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, కీల‌క నాయ‌కుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డిలు.. కోటిని కూర్చోబెట్టి స‌ర్ది చెప్పారు. నోముల‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. దీంతో ఆయ‌న నోముల‌కు స‌హ‌క‌రించారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు నోముల హ‌ఠాన్మ‌ర‌ణంతో కోటి తిరిగి ఇక్క‌డ సీటు కోరే అవ‌కాశం ఉంది. కానీ, టీఆర్ ఎస్ మాత్రం నోముల కుమారుడి వైపు చూస్తుంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో కోటిలో అసంతృప్తి మ‌రింత పెరుగుతుంది. దీనిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. జానా క‌నుక క‌మ‌లం గూటికి రాక‌పోతే.. కోటిని చేర్చుకుని.. నాగార్జున సాగ‌ర్ టికెట్ ఆయ‌న‌కు ఇచ్చేలా వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు స్థానికంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ జానా కాంగ్రెస్ త‌ర‌ఫున‌ రంగంలోకి దిగితే.. ఆయ‌న‌పై ఎలాగూ సానుభూతి ఉంద‌ని.. ఇది వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. హుజూర్ న‌గ‌ర్‌లో జ‌రిగిన ప‌రాభ‌వం మాదిరిగా ఇక్క‌డ కూడా బీజేపీకి 2-3 ఓట్లు వ‌చ్చే అవ‌కాశమే క‌నిపిస్తోంది. అందుకే.. బీజేపీ అధిష్టానం ఈ విష‌యంలో చాలా లోతుగా ఆలోచిస్తోంది.  ఈ నేప‌థ్యంలో అయితే.. కోటి రెడ్డి లేక‌పోతే.. జానా ర‌ఘువీరారెడ్డిల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేత‌లు.. రంగంలోకి దిగుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి చూడాలి ఏంజ‌రుగుతుందో.
Tags:    

Similar News