ధర్మాన గెలిచినట్లేనా...?

Update: 2023-03-17 09:11 GMT
వైసీపీలో సీనియర్ మంత్రి, ఉత్తరాంధ్రా జిల్లాలలో అత్యంత  వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నేత అయిన ధర్మాన ప్రసాదరావు మొత్తం మీద గెలిచారు. ఆయన గెలవడం ఏమిటి అనుకోవద్దు. ఆయన తానుగా వలచి నిలబెట్టిన నర్తు రామారావు అనే వైసీపీ అభ్యర్ధి సథానిక సంస్థల ఎన్నికల కోటాలో విజయం సాధించారు. నర్తు రామారావుకు టికెట్ కావాలని పట్టుబట్టి మరీ జగన్ వద్ద మాట నెగ్గించుకుని సాధించిన ధర్మానకు ఆ తరువాతనే అసలైన పరీక్ష ఎదురైంది.

శ్రీకాకుళం జిల్లాలో  మొత్తం 776 ఓట్లు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థలలో వైసీపీ సభ్యులే నూటికి తొంబై శాతంగా ఉన్నారు. అయినా ఏకగ్రీవం చేసుకోలేకపోయారు మంత్రి గారు. దానికి కారణం ఎమ్మెల్సీ సీటు కావాలని మరో బలమైన తూర్పు కాపు సామాజికవర్గం పట్టుబట్టడమే. అయితే యాదవ సామాజికవర్గానికి సీటు ఇప్పించుకున్న ధర్మానకు ఇండిపెండెంట్ రూపంలో సవాల్ ఎదురైంది.

మజీ జెడ్పీటీసీ మెంబర్ అయిన ఆనెపు రామక్రిష్ణ పోటీకి సిద్ధపడ్డారు. ఆయన చేత విత్ డ్రా చేయించకుండా ఇంటా బయటా కొన్ని శక్తులు అడ్డుపడడంతో ధర్మాన హైరానా మామూలుగా లేదు. మరో వైపు వైసీపీ అధినాయకత్వం కూడా గెలిపించుకుని రావాల్సిందే అని మంత్రి గారిని ఆదేశించినట్లుగా ప్రచారం సాగింది. దాంతో ఒక పక్క సామాజికవర్గం సమరం, ఇంకో వైపు అసంతృప్తులు ఓట్ల చీలిక భయంతో ధర్మాన గట్టి వ్యూహాలనే పన్నారు.

చివరికి చూస్తే ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 776 ఓటర్లకు గాను శ్రీకాకుళం రెవిన్యూ డివిజనులో 233 మంది, పాలకొండలో 149 మంది, టెక్కలిలో 161 మంది, పలాస రెవిన్యూ డివిజనులో 209 మంది వెరశి 752 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో ఓట్ల లెక్కింపు తరువాత చూస్తే వైసీపీ అభ్యర్ధి నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధి ఆనెపు రామకృష్ణకు 108 ఓట్లు, చెల్లని ఓట్లు 12 వచ్చాయి. ఈ పరిణామంతో ధర్మాన ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధికి 108 ఓట్లు రావడం మాత్రం మామూలు విషయం కాదనే అంటున్నారు.

ఆయన వెనక ఎవరు ఉన్నారు అంటే కచ్చితంగా టీడీపీ అనే అంటున్నారు. అయితే టీడీపీ ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చింది. అలాగే తూర్పు కాపు సామాజికవర్గం బలం కూడా పనిచేసింది అని అంటున్నారు.

ఏది ఏమైనా ఆనెపు రామక్రిష్ణ మంత్రి గారిని బాగానే ఇబ్బంది పెట్టారనే అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఇచ్చాపురం నుంచి ముమ్మారు ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్ట సభలోకి అడుగుపెట్టలేని నర్తు రామారావుకు ఈ ఎన్నికల్లో ఘన విజయం దక్కడంతో ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా ఆయన కొనసాగనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News