అగ్రరాజ్యాన్ని ఇరాన్ భారీగానే దెబ్బ తీసిందా?

Update: 2020-01-25 07:09 GMT
ఇరాన్  సైనిక  చీఫ్ ను డ్రోన్ క్షిపణి సాయం తో  హతమార్చిన వైనం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారం మధ్యప్రాచ్యంలో యుద్ద మేఘాల్ని దట్టంగా అలుముకునేలా చేయటమే కాదు.. మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న సందేహాన్ని కలిగించాయి. తమ సైనిక చీఫ్ ను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న అమెరికా కు బుద్ధి చెప్పేందుకు ఇరాన్ దళాలు.. ఇరాక్ లోని అమెరికా పోస్టు మీద క్షిపణులతో దాడికి పాల్పడ్డాయి.

ఈ సందర్భంగా అమెరికాకుచెందిన పలువురు సైనికులు గాయ పడినట్లుగా ఇరాన్ చెబితే.. అలాంటిదేమీ లేదని.. దాడుల సమయంలో తమ సైనికులు ఎవరూ లేరంటూ అమెరికా వెల్లడించింది. ఇరాన్ ప్రతీకారంతో చేసిన దాడి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లుగా మాట్లాడింది. అయితే.. ఈ విషయంలో ట్రంప్ తో సహా అమెరికా చెప్పినవన్నీ అబద్ధాలన్న విషయం తాజాగా తేలింది.

ఎందుకంటే.. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో 34 మంది సైనికుల ఆరోగ్యం ప్రభావితం కావటమే కాదు.. వైద్య చికిత్స కోసం వారిని జర్మనీకి తరలించి.. తాజాగా మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరించారు. వారికి మెదడు సంబంధిత సమస్యలు తలెత్తినట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. దీంతో.. ఇరాన్ దాడి విషయంలో ఆ దేశం చెప్పిందే నిజమని.. అమెరికా కల్లిబుల్లి కబుర్లు చెప్పిందన్న విషయం తాజాగా తేలి పోయింది.

అన్నింటికంటే దారుణమైన విషయం ఏమంటే.. సొంత సైనికులకు జరిగిన నష్టం గురించి ట్రంప్ చేసిందంతా కవరింగే తప్పించి ఇంకేమీ లేదని తేలిపోయింది. ఇప్పటికి వారికి చాలా చిన్న దెబ్బలే తగిలాయంటూ తమ బడాయితనాన్ని ప్రదర్శిస్తూ నవ్వులపాలు అవుతున్న దుస్థితి. మిగిలిన విషయాల్లో అబద్ధాలంటే అర్థం చేసుకోవచ్చు. సొంత సైనికుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాటలిప్పుడు ఆయన స్థాయిని మరింత తగ్గేలా చేశాయంటున్నారు.
Tags:    

Similar News