నంద‌మూరి కుటుంబానికి మ‌ళ్లీ అన్యాయ‌మే!

Update: 2020-10-20 04:15 GMT
టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు...ఆంధ్రుల‌ అన్న‌గారు.. నంద‌మూరి తార‌క‌రామారావు కుటుంబానికి రాజ‌కీయంగా మ‌రోసారి అన్యాయం జ‌రిగిందా? అన్న‌గారి త‌ర్వాత ఆ కుటుంబానికి ఆశించిన మేరకు రాజ‌కీయంగా న్యాయం జ‌ర‌గ‌డం లేదా?  అంటే.. తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించిన వారు ఔన‌నే అంటున్నారు. నంద‌మూరి కుటుంబం నుంచి బాల‌య్య ఒక్క‌రు మాత్ర‌మే ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన వారిలో ఎవ‌రికీ కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

నంద‌మూరి హ‌రికృష్ణ‌.. కొన్నాళ్లు వెలిగినా.. త‌ర్వాత ఆయ‌న ఆశించిన ప‌ద‌వులు కానీ, గుర్తింపు కానీ టీడీపీలో ల‌భించ‌లేదు. ఆ అసంతృప్తి ఆయ‌న‌ను చివ‌రి వ‌ర‌కు వెంటాడింది. ఇక‌, ఆ కుటుంబం నుంచి ఎవ‌రైనా కీల‌క నాయ‌కులు వ‌స్తారేమోన‌ని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అనూహ్యంగా 2018, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కుమార్తె సుహాసినిని కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి చంద్ర‌బాబు రంగంలోకి దింపారు. అయితే, టీఆర్ ఎస్ పెనుగాలుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న విష‌యం తెలిసి కూడా చంద్ర‌బాబు ఆమెను రంగంలోకి దింపార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. మేన‌మామ ఆదేశం, రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక నేప‌థ్యంలో సుహాసిని చెమ‌టోడ్చా రు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి మౌనం పాటించారు. ఇదిలావుంటే, సుహాసినికి తెలంగాణ‌లో కాద‌ని, ఏపీలో అవ‌కాశాలు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌చ్చాయి. చంద్ర‌బాబు కుటుంబం మొత్తం.. ఏపీలోను, నంద‌మూరి కుటుంబానికి(బాల‌య్య త‌ప్ప‌) తెలంగాణ‌లోను అవ‌కాశం ఏంటి? అక్క‌డ పార్టీకి బ‌లం ఎక్క‌డుంద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు.

తాజాగా రెండు రాష్ట్రాల పార్టీ క‌మిటీల‌ను చంద్ర‌బాబు ప్ర‌క్షాళ‌న చేశారు. ఈక్ర‌మంలోనే సుహాసినికి ఏపీలో అవ‌కాశం ఇస్తార‌ని.. ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టిపెరిగిన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌చ్చాయి. కానీ, అనూహ్యంగా ఆమెను తెలంగాణ పార్టీ ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మించారు. దీంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల జోరు పెరిగింది. ఉద్దేశ పూర్వ‌కంగానే చంద్ర‌బాబు నంద‌మూరి ఫ్యామిలీని అణిచేస్తున్నార‌ని, తెలంగాణ‌లో పార్టీకి జ‌నాలే లేన‌ప్పుడు ఉపాధ్య‌క్షురాలిగా ఉండి సుహాసిని చేసేది ఏముంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు, నంద‌మూరి కుటుంబానికి ఏదైనా నిజాయితీగా చేయాల‌నుకుంటే.. ఏపీలో క‌దా చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వాల‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న మేధావులు కూడా ఇదే క‌రెక్ట్ అని అంటున్నారు. మరి బాబు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. నంద‌మూరి ఫ్యామిలీ ఏమిచ్చినా స‌ర్దుకుపోతోంది.. అందుకే బాబు ఇలా చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News