అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వ్యక్తి?

Update: 2022-03-20 02:30 GMT
అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుడు ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కొనసాగుతున్నారు. ఒకవేళ వయోభారంతో జోబిడన్ వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోతే ఆయన స్థానంలో ఇండో-అమెరికన్ కాంగ్రెస్ మెన్ రోహిత్ ఖన్నా పోటీచేయాల్సిందిగా బెర్నీ సాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ కీలక సభ్యులు, డెమోక్రటిక్ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.

ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ కు 79 ఏళ్లు. వచ్చే దఫా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీచేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చని ఆయనే అంటున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కమల హారిస్ కు గెలుపు అవకాశాలు అంతగా లేవని డెమొక్రటిక్ నేతలు భావిస్తున్నారు.

దీంతో పార్టీలో కీలక నేతగా.. చురుకుగా వ్యవహరిస్తున్న రోహిత్ ఖన్నా అధ్యక్ష పదవి రేసులో ఉంటే మంచిదని సాండర్స్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ సభ్యులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.

వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకుంటే ఖన్నా పోటీలో ఉండాలనిపలువురు గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను ఖన్నా సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు సమాచారం.

1976లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో రోహిత్ ఖన్నా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పంజాబ్ కు చెందిన వారు. లాలా లజపతి రాయ్ తో కలిసి రోహిత్ ఖన్నా తాతయ్య భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ తరుఫున ప్రచారం చేస్తూ ఆయన విజయంలో కీలక పాత్రను ఖన్నా పోషించాడు. ప్రస్తుతం కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఆన్ ఎమర్జింగ్ బయోటెక్నాలజీ పోస్టుకు ఖన్నాను నామినేట్ చేస్తూ గురువారం జోబైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News