మోడీ హ‌యాంలో పోయిన 'స్వేచ్ఛ' ర్యాంక్ ఎంతంటే?

Update: 2019-04-19 04:49 GMT
దేశభ‌క్తికి నిలువెత్తు రూపంగా ప‌లువురు కొలిచే దిగ్రేట్ మోడీ గారు ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కాలంలో దేశంలో ప‌డిపోయిన ఒక స్వేచ్ఛ‌కు సంబంధించిన ర్యాంకింగ్ భార‌త‌దేశంలోని ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో చెప్ప‌క‌నే చెప్పింది. మైకు చేతికి వ‌చ్చిందంటే చాలు.. విలువ‌ల గురించి గొప్ప‌గా మాట‌లు చెప్పే మోడీ మాస్టారి హ‌యాంలో దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో తాజా నివేదిక స్ప‌ష్టం చేసింది.

దేశంలో ప‌త్రికా స్వేచ్ఛ విష‌యంలో భార‌త ర్యాంకు ఎంత‌గా ప‌డిపోయిందో తాజాగా విడుద‌ల చేసిన ర్యాంక్ ను చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. పారిస్ కేంద్రంగా ప‌ని చేసే రిపోర్ట‌ర్స్ వితౌట్ బోర్డ‌ర్స్ అనే ఎన్జీవో 2019 సంవ‌త్స‌రానికి ప్ర‌తికా స్వేచ్ఛ‌కు సంబంధించి 180 దేశాల‌కు ర్యాంకులు కేటాయించింది.

జాతీయ‌వాదాన్ని బ‌లంగా వినిపిస్తూ.. దేశంలోని దేశ‌భ‌క్తి ఉన్న నేత‌ల్లో త‌మ పార్టీ నేత‌లు ముందు వ‌రుస‌లో ఉంటార‌ని.. ఆ త‌ర్వాతే ఎవ‌రైనా అన్న‌ట్లుగా చెప్పే మోడీ మాష్టారి మాట‌ల్ని ప‌క్క‌న పెట్టేస్తే.. ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఈ నివేదిక‌లో పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల వేళ పాత్రికేయుల మీద అధికార బీజేపీ నేతల దాడులు పెరిగిపోయిన విష‌యాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేసింది.

ఏడాది కాలంలో భార‌త్ లో జ‌ర్న‌లిస్టుల మీద జ‌రిగిన హింసాత్మ‌క దాడుల్లో ఆరుగురు చ‌నిపోయార‌ని.. ఏడో జ‌ర్న‌లిస్ట్ మృతి మీద ప‌లు సందేహాలు ఉన్న‌ట్లుగా పేర్కొంది. భార‌త్ లో పాత్రికేయుల మీద పోలీసులు.. మావోలు.. నేర ముఠాలు.. అవినీతి రాజకీయ నేతల హింసాత్మ‌క దాడుల‌కు పాల్ప‌డి బెదిరించ‌టం లాంటివి అంశాలు ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. ఇంగ్లిషు జ‌ర్న‌లిస్టుల కంటే ఇత‌ర భాష‌ల‌కు ప‌ని చేస్తున్న రిపోర్ట‌ర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే జ‌ర్న‌లిస్టుల మీద దాడులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

2018లో ప‌త్రికా స్వేచ్ఛ‌కు 2018లో 138వ ర్యాంకింగ్ ను ద‌క్కించుకోగా.. తాజాగా మ‌రో రెండుస్థానాలు కింద‌కు ప‌డిపోయి తాజా ర్యాంక్ 140కు దిగ‌జారింది. ప్ర‌తికా స్వేచ్ఛ‌లో నార్వే హ్యాట్రిక్ సాధిస్తూ.. ముచ్చ‌ట‌గా మూడోసారి తొలి ర్యాంక్ లో నిలిచింది. ఫిన్లాండ్.. స్వీడ‌న్.. నెద‌ర్లాండ్స్ వ‌రుస‌గా టాప్ ఫోర్ స్థానాల్లో నిలిచాయి. భార‌త దాయాది పాక్ 142వ ర్యాంక్.. బంగ్లాదేశ్ 150 ర్యాంక్ ను సొంతం చేసుకున్నాయి. ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా (110).. గాంబియా (92)లు భార‌త్ కంటే బెట‌ర్ ర్యాంకుల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News