రాజ్యసభ ఎన్నికలకు నోటిపికేషన్.. ఏపీకి ఎప్పుడు?
రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిషికేషన్ జారీ చేసింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాల్లో 37 ఎంపీ సీట్లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.;
రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిషికేషన్ జారీ చేసింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాల్లో 37 ఎంపీ సీట్లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 16న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 26న కాగా.. నామినేషన్ల చివరి తేదీ మార్చి 5. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9ని గడువుగా విధించారు.
ఏప్రిల్ లో 37 స్థానాలు ఖాళీ అవుతుంటే.. జూన్ లో 22 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను తర్వాత విడుదల చేయనున్నారు.దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి చివర్లో కానీ.. ఏప్రిల్ లో కానీ వెలువడే వీలుంది. మొత్తంగా ఈ ఏడాది వివిధ విడతల్లో 72 నుంచి 75 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఏప్రిల్, జూన్ తో కలిపి మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజాగా విడుదలైన రాజ్యసభ స్థానాల ఖాళీలు రాష్ట్రాల వారీగా చూస్తే..
మహారాష్ట్ర (7)
తమిళనాడు (6)
బీహార్ (5)
పశ్చిమ బెంగాల్ (5)
ఒడిశా (4)
అస్సాం (3)
తెలంగాణ (2)
హర్యానా (2)
ఛత్తీస్‌గఢ్ (2)
హిమాచల్ ప్రదేశ్ (1)
తాజా నోటిఫికేషన్ లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్ఎస్ కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డిలు రిటైర్ కానున్నారు. ఈ జూన్ లో 22 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. వీరిలో ముగ్గురు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. ఒకరు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వైసీపీకి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు
అయోధ్య రామిరెడ్డి
పరిమళ్ నత్వానీ
పిల్లి సుభాష్ చంద్రబోస్
టీడీపీ నుంచి సానా సతీష్ బాబు. వీరి పదవీ కాలం జూన్ 21న ముడియనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. జూన్ లో పదవీ కాలం పూర్తి చేసుకునే రాజ్యసభ సభ్యుల్లో పలువురు ప్రముఖులు ఉన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్నారు. వీరితో పాటు పలువురు రిటైర్ కానున్నారు. జూన్ లో రిటైర్ అయ్యే రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల వారీగా
ఆంధ్రప్రదేశ్ (4)
కర్ణాటక (4)
మధ్యప్రదేశ్ (3)
రాజస్థాన్ (3)
గుజరాత్ (4)
జార్ఖండ్ (2)
అరుణాచల్ ప్రదేశ్ (1)
మణిపూర్ (1)
మేఘాలయ (1)
ఫిబ్రవరి 2026 నాటికి ఎన్డీయే కూటమి మెజార్టీకి సమీపంలో ఉంది. కాస్తంత మెజార్టీ కలిగి ఉందని చెప్పాలి. మొత్తం 245 మంది సభ్యుల్లో ఎన్డీయేకు 114-121 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. అదే సమయంలో ఇండియా కూటమికి 79-85 మంది సభ్యులు ఉన్నారు. తటస్థ పార్టీలు సుమారు 30-35 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ, బీఆర్ఎస్ లు ఉన్నాయి. రాజ్యసభలో అతి పెద్ద పార్టీగా బీజేపీని చెప్పాలి. ఈ పార్టీకి 98-103 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ కు 27 మంది సభ్యులు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 12 - 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, డిఎంకె 10 మంది సభ్యులు ఉన్నారు. మిగిలిన పార్టీలన్ని సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి.