కరోనా నుంచి కోలుకున్నామని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే మూల్యం తప్పదు!

Update: 2021-05-21 00:30 GMT
కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ వేవ్ లో వైరస్ నుంచి కోలుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రెండోసారి మహమ్మారి ధాటికి గురయ్యారు. కాగా ఇటీవల ఈ అంశాలపై చర్చలు పెరిగాయి. ఈ క్రమంలో ఏమాత్రం లక్షణాలు ఉన్నా జనం భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నామనే నిర్లక్ష్యం తగదని నిపుణులు అంటున్నారు. తమకేం కాదు అనుకోవడం అపోహ అని హెచ్చరిస్తున్నారు.

కొవిడ్ నుంచి కోలుకున్నాక మళ్లీ వైరస్ దాడి చేస్తుందా? అనే అనుమానాలపై నిపుణులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వైరస్ నుంచి విముక్తి పొందిన కొంత కాలానికి మళ్లీ సోకితే దానినే లాంగ్ కొవిడ్ గా పరిగణిస్తారని చెబుతున్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయని వెల్లడించారు. కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవాకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. మొదటి సారి కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది లోపు మళ్లీ వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని జాతీయ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ హెడ్ ఎన్కే అరోరా వెల్లడించారు.

కొవిడ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లాంగ్ కొవిడ్ పై చర్చ సాగుతోంది. యాంటీబాడీలు తగ్గగానే వైరస్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఏదైనా వైరస్ సోకితే దానిని ఎదుర్కొవడానికి వ్యాక్సినేషన్ లేదా ఇతర మార్గాల ద్వారా యాంటీ బాడీలు అభివృద్ధి చెందేలా చూస్తారు. అవి మూడు నుంచి తొమ్మిది నెలల పాటు శరీరంలో ఉంటాయని తెలిపారు. ఒక్కసారి యాంటీబాడీలు తగ్గితే ఆ వైరస్ తిరిగి విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం లాంగ్ కొవిడ్ కేసులు చాలా అరుదుగా ఉన్నా ముందు జాగ్రత్తలు అవసరమని నిపుణులు అంటున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అలసట, శ్వాస సంబంధ సమస్యలు, నరాల బలహీనత వంటివి ఏర్పడే అవకాశం ఉందని సూచించారు. కొవిడ్ నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడితే దానిని లాంగ్ కొవిడ్ గా పరిగణిస్తారని నిపుణులు వెల్లడించారు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్నాం కదా మాకేం కాదు అనుకునే వాళ్లు మరికొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లేదంటే మూల్యం తప్పదని హెచ్చరించారు.




Tags:    

Similar News