జగన్ పార్టీ నేతలు కేసులు పెడితే.. తిరిగి కేసులు పెట్టాలట

Update: 2020-12-13 03:27 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుకు కుడి.. ఎడమ చేతులుగా.. అవసరానికి తగ్గట్లు వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్.. ఆ మధ్యన బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. అప్పుడప్పుడు తనదైన శైలిలో ఇచ్చే సందేశాలతో వార్తల్లోకి వచ్చే ఆయన.. తాజాగా తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలకు కీలక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రజల అజెండాతో ముందుకు వెళ్లాలన్న ఆయన.. అప్పుడు మాత్రమే ప్రజాభిమానాన్ని పొందగలుగుతామన్నారు. మరింత బాగా తెలిసిన సీఎం రమేశ్..తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రజాభిమానంతో ఎందుకు గెలవలేదో? ఆ విషయాన్ని అలా వదిలేస్తే.. తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో కీలక అంశాల్ని చూస్తే.. బీజేపీ నేతలపై జగన్ పార్టీ నేతలు కేసులు పెడితే.. ఊరుకోవాల్సిన అవసరం లేదన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తిరిగి కేసులుపెట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టేందుకు అవసరమైన మెటీరియల్ అందరి వద్ద ఉందన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ ఆ మెటీరియల్ ఏమిటి? అన్నది క్వశ్చన్ గా మారింది. ఇక.. పార్టీ గురించి చెప్పిన ఆయన.. తెలంగాణలో ఇటీవల బీజేపీ సాధించిన విజయాలపై తనదైన భాష్యాన్ని చెప్పుకొచ్చారు.

దేశంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా.. బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఆయన.. తెలంగాణలో దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఉత్తరాదిలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి బలం ఉన్న కొన్ని స్థానాల్ని మిస్ చేసుకోవటాన్ని సీఎం రమేశ్ మర్చిపోయారా? అసలు ఆ విషయమే తెలీదా?
Tags:    

Similar News