క‌రోనాతో చ‌నిపోతే.. ప‌రిహారం ఇవ్వాల్సిందేః సుప్రీం

Update: 2021-06-30 12:33 GMT
మ‌న దేశంపై క‌రోనా మ‌హ‌మ్మారి చేసిన దాడి అసాధార‌ణ‌మైన‌ది. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్లాది మంది జీవితాలు ప్ర‌భావితం అయ్యాయి. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఒకెత్త‌యితే.. క‌రోనా బారిన ప‌డి దాచుకున్న సొమ్ము మొత్తం ఖ‌ర్చు చేసుకొని, అప్పుల‌పాలవ‌డం మ‌రో దారుణం. ఇంతా చేస్తే.. చివ‌ర‌కు ప్రాణాలు కూడా ద‌క్క‌నివారి కుటుంబ స‌భ్యుల‌ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రం.

ఇలాంటి వారికి ప్ర‌భుత్వం ఖ‌చ్చితంగా చేయూత‌నివ్వాల‌ని, వారిని ఆదుకోవాల్సిందేన‌ని అత్యున్న‌త ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారికి రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని గ‌తంలో ఓ వ్యాజ్యం దాఖ‌లైంది. దీని విచార‌ణ సంద‌ర్భంగా.. కేంద్రం స్పందిస్తూ త‌మ వ‌ద్ద అంత నిధులు లేవ‌ని, త‌మ వ‌ల్ల కాద‌ని చెప్పింది.

కాగా.. ఇదే విష‌య‌మై మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం.. బాధితుల‌కు క‌నీస స‌హ‌కారం అందించ‌డం స‌ర్కారు బాధ్య‌త అని తేల్చి చెప్పింది. ఇందుకు త‌గిన నిబంధ‌న‌లు రూపొందించాల‌ని జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ‌ను ఆదేశించింది. మృతుల కుటుంబాల‌కు ఎంత చెల్లించాల‌నేది మీరే నిర్ణ‌యించాల‌ని చెప్పింది.

ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న‌న్న సుప్రీం.. రాబోయే ఆరు వారాల్లో ఖ‌చ్చిత‌మైన గైడ్ లైన్స్ రూపొందించాల‌ని ఆదేశించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా కొవిడ్ మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించాల‌ని తేల్చి చెప్పింది.


Tags:    

Similar News