సూసైడ్ చేసుకునే భార్యకు అగ్గిపుల్లను చేతికి ఇచ్చిన భర్త

Update: 2020-12-07 08:30 GMT
భార్యభర్తల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. గతంలో మాదిరి అన్యోన్యంగా ఉండే వారు ఎంత మంది అన్నది పక్కన పెడితే.. గొడవలతో ప్రాణాలు తీసుకునే భార్యాభర్తలు ఎక్కువ అవుతున్నాయి. వీటికి తోడు వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తల్ని చంపుతున్న భార్యలు.. భార్యల్ని కడతేరుస్తున్న భర్తల ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గొడవలు ఎన్ని ఉన్నా.. స్థాయి దాటే వరకు వెళ్లకుండా గతంలో భార్యభర్తలు జాగ్రత్త పడేవారు. మరీ.. కుదరదంటే ఎవరి దారి వారు చూసుకునేవారు. అంతే తప్పించి.. ప్రాణాల మీదకు తెచ్చుకునే వరకు వెళ్లేవారు కాదు. ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళనను కలిగిస్తున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతమే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. గొడవ పడిన భార్యభర్తల మధ్య వివాదం అంతకంతకూ ముదరగా.. విసిగిన భార్య ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే.. భర్త స్వయంగా అగ్గిపుల్ల ఇచ్చిన వైనం సంచలనంగా మారింది. కట్టలు తెగిన కోపంతో అగ్గిపుల్ల వెలిగించుకొని అగ్నికి ఆహుతైన దారుణం తాజాగా చోటు చేసుకుంది.

సంచలనంగా మారిన ఈ ఉదంతంఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో చోటు చేసుకుంది. షారుఖ్.. షహీనాలకు నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు కొడుకులు. భార్యభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. వీటికి తోడు అత్తమామల వేధింపులు ఉండేవి. మనస్తాపానికి గురైన షహీనా ఒంటి మీద పెట్రోల్ పోసుకుంది. ఇలాంటివేళ.. భార్యను వారించి.. అనునయించాల్సిన భర్త అందుకు భిన్నంగా తనకేమీ పట్టనట్లు ఊరకుండిపోయాడు.

దీంతో ఇష్యూ మరింత తీవ్రమైంది. తనకు అగ్గిపెట్ట ఇవ్వాలని అడిగితే భర్త ఇవ్వటం.. తీవ్రమైన మనో వ్యధకు గురైన షహీనా.. అగ్గిపుల్లను వెలిగించుకొని.. ఒంటికి అంటించుకుంది. ఇష్యూ అంతవరకు వెళుతుందని భావించని షారుఖ్.. అప్పుడు స్పందించారు. కానీ.. అప్పటికే ఆలస్యమైంది. పెద్ద ఎత్తున మంటలు అంటుకోవటంతో కళ్ల ముందే కట్టుకున్న భార్య తీవ్ర గాయాలపాలైంది.  ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి.. షారుక్ గాయాలపాలయ్యాడు.

బంధువుల సాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. శరీర భాగాలు ఎక్కువగా కాలటంతో ఆమెకు ప్రాణాపాయం ఉందని చెబుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిన్న గొడవ ఎంతవరకు వెళ్లిందన్నది ఒకటైతే.. కట్టలు తెగిన కోపంతో భార్య విచక్షణ మరిస్తే.. వారించాల్సిన భర్త చేసిన తప్పును పలువురు తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News