సుడి అంటే ఆ ఊరి వాళ్లదే.. రాళ్లు ఏరుకొని లక్షలు సంపాదిస్తున్నారట

Update: 2020-09-03 00:30 GMT
లక్ష రూపాయిలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? ఎలాంటి కష్టం లేకుండా.. ఊళ్లో పడిన రాళ్లను ఏరుకొని అమ్ముకోవటం ద్వారా భారీగా సంపాదించే సుడి ఎవరికి మాత్రం లభిస్తుంది చెప్పండి. ఇప్పుడు అలాంటి అదృష్టాన్నే సొంతం చేసుకున్నారు ఆ ఊరి వాళ్లు. బ్రెజిల్ ఈశాన్య ప్రాంతంలోని శాంతా ఫిలోమెనా అనే పట్టణంలో గత నెల 19న ఒక అద్భుతం జరిగింది. ఆకాశంలో నుంచి వందలాది రాళ్లు వచ్చి  ఆ ఊళ్లో పడ్డాయి.

ఇదంతా చూసిన వారు.. ఏదో జరిగిందని తెగ ఆందోళన చెందారు. ఈ రాళ్ల వర్షం తగ్గాక.. కొందరు ఆ రాళ్లను సేకరించారు. అవి కాస్తా విలువైన రాళ్లుగా తేలటంతో.. ఇక ఆ ఊళ్లోని వారంతా రాళ్లను ఏరుకునే పనిలో బిజీ అయ్యారు. ఇంతకీ ఆ రాళ్ల కతలోకి వెళితే.. అవి సాధారణమైన రాళ్లు కావని.. ఎప్పుడో మన సౌర కుటుంబం ఏర్పడిన 460 కోట్ల ఏళ్ల నాటివిగా తేల్చారు.

అవి ఉల్కల మాదిరి భూమి మీద పడ్డాయి. అదృష్టం బాగుండి ఆ ఊరి మీద పడటంతో.. ఇప్పుడు వారు ఆ రాళ్లను సేకరించే పనిలో బిజీ అయిపోయారు. ఇప్పటివరకు ఆ పట్టణానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ప్రశాంతమైన వాతావరణం తప్పించి మరే ప్రత్యేకత లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలిసిన ఉల్కల్లో తాజాగా పడిన ఉల్కల రకం ఒక శాతం మాత్రమే తెలుసట.

దీంతో.. వీటి డిమాండ్ పెరిగిపోయింది. నలభై కేజీల బరువున్న రాయి ఏకంగా రూ.19లక్షల వరకు పలికింది. మొదట్లో ఈ రేటు పలకగా.. రోజులు గడుస్తున్నకొద్దీ.. వీటి ధర అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం డిమాండ్ ఎంతలా పెరిగిందంటే.. గ్రాము రాయి దొరికితే రూ.500 ఇస్తున్నారట. ఈ రాళ్ల కోసం చుట్టుపక్కల వారు మాత్రమే కాదు.. ఎక్కడెక్కడి వారో వచ్చి తెగ కొనేసుకుంటున్నారట.వీటిని అమ్మేవారికి అమ్మితే లక్షలాది రూపాయిలు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకు ఆ ఊళ్లో ఉన్న జనాభాలో 90 శాతం రైతులే. ఇప్పుడు అంతా రాళ్లు ఏరేసుకొని అమ్మేస్తూ.. తమకున్న అప్పుల్ని తీర్చేసి సంపన్నులు అయిపోతున్నారట. మొత్తంగా చూస్తే.. ఆకాశంలోని నుంచి పడిన రాళ్లు.. వారి బతుకుల్ని మొత్తంగా మార్చేశాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News