మోడీ చెప్పిన ఆ మాటకు జనాలు చప్పట్లే చప్పట్లు

Update: 2016-12-04 07:08 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించిన సంచలన నిర్ణయంతో సీన్ మొత్తం రాత్రికి రాత్రే మారిపోయింది. అప్పటివరకూ జేబులో ఉన్న పెద్ద నోట్లు భరోసా ఇస్తే.. నవంబరు 8 రాత్రి నుంచి.. అవే పెద్ద గుది బండలుగా మారాయి. చిన్న నోట్ల కోసం.. కొత్త కరెన్సీ కోసం జనాలు పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. బ్యాంకుల దగ్గరా.. ఏటీఎంల దగ్గరా భారీ క్యూలు పేరుకుపోయి.. గంటల కొద్దీ సమయం క్యూలకే వెచ్చించాల్సిన పరిస్థితి.

ఇలాంటి వేళ.. పలువురు మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. సామాన్యుల్ని మోడీ ఇంత కష్టపెడుతున్నారంటూ ఆవేశాన్ని ప్రదర్శిస్తున్న వారి సంఖ్య ఈ మధ్యన మరీ ఎక్కువైపోతోంది. సామాన్యుల సంగతి తర్వాత.. మీ సంగతి ఏమిటని ఎవరినైనా అడిగితే.. కామన్ మ్యాన్ ను ఇబ్బంది పెడితే ఎవరు మాత్రం సహిస్తారంటూ సంబంధం లేని వాదనను వినిపిస్తున్న కొందరు తారసపడుతుంటారు.

ఇలాంటి మాటల్ని విన్నప్పుడు.. మోడీ మీద ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి.. ఆగ్రహం ఉందన్న భావన వ్యక్తం కావటం ఖాయం. ఇదిలా ఉంటే.. తాజాగా యూపీలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ మాటలన్నింటిలోకి.. ఒక్క విషయంలో మాత్రం ప్రజలు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టటం కనిపించింది. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఈ సన్నివేశం చూస్తే.. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా.. సామాన్యులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలుచుంటున్నారని చెబుతూ.. ‘‘బ్యాంకుల వద్ద గంటల కొద్ది క్యూలలో నిలబడుతున్న దేశ ప్రజలకు నా శాల్యూట్’’ అన్న మాట వచ్చిన వెంటనే.. సభలోని వారు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టటం గమనార్హం. క్యూలలో నిలుచున్న వారిలో.. ఇన్నేసి గంటలు నిలబడి రావాల్సి రావటంపై చిరాకు.. అసహనం చెందుతున్నా.. బ్లాక్ మనీ లెక్క తేల్చటానికి ప్రధాని తీసుకున్న నిర్ణయానికి తాను భాగస్వామిని అవుతున్నానన్న భావనే ఎక్కవగా ఉందన్న మాట వినిపిస్తోంది. అది నిజమన్న విషయాన్ని మొరదాబాద్ సభలోని వేలాది మంది తమ చప్పట్లతో స్పష్టం చేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News