మాజీ ఎంఎల్ఏకి భారీ జరిమానా..దొంగ కరెంటు బాగోతం

Update: 2020-12-08 06:30 GMT
తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ కొమ్మాలపాటి శ్రీధర్ కు విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు భారీ జరిమానా విధించారు. నాలుగేళ్ళుగా విద్యుత్ ను దొంగతనంగా వాడుకుంటున్న విషయం బయటపడటంతో ఏకంగా రూ. 1.69 కోట్ల జరిమానా విధించారు. జరిమానా చెల్లిస్తే కానీ కొమ్మాలపాటికి చెందిన స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులకు విద్యుత్ సరఫరా చేసేది లేదని తేల్చి చెప్పేశారు. కొమ్మాలపాటి విషయం బయటపడటంతో పార్టీలో సంచలనంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు ఎంఎల్ఏకి ఓ స్పిన్నింగ్ మిల్ తో పాటు మరో జిన్నింగ్ మిల్లు కూడా ఉంది. జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన విద్యుత్ బిల్లు చెల్లించకపోవటంతో 2016లోనే విద్యుత్ అధికారులు మిల్లును తనిఖీ చేశారు. పాత బకాయిలు రూ. 16 లక్షలతో పాటు సర్చార్జి రూ. 5 లక్షలు అంటే మొత్తం రూ. 24 లక్షలు చెల్లిస్తే కానీ విద్యుత్ రీ కనెక్షన్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు.

అయితే కొంత కాలం తర్వాత చూస్తే చక్కగా ఇటు స్పిన్నింగ్ మిల్లుతో పాటు అటు జిన్నింగ్ మిల్లు కూడా చక్కగా పనిచేస్తోంది. అనుమానం వచ్చిన అధికారులు మళ్ళీ రెండు మిల్లులను తనిఖీ చేశారు. అయితే అప్పుడు ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు కానీ అధికారులు మిల్లుల్లో నుండి వెనక్కు వెళ్ళిపోయారు. వెన్నక్కు వెళ్ళిపోవటమే కాదు మళ్ళీ మిల్లుల వైపు తొంగి కూడా చూడలేదు.

సీన్ గిర్రున తిరిగి 2019లో ఎన్నికలు రావటం కొమ్మాలపాటితో పాటు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. బకాయిల వసూళ్ళ విషయమై జిల్లాలోని కమర్షియల్ కనెక్షన్లను పరిశీలిస్తుంటే కొమ్మాలపాటి మిల్లుల విషయం బయటపడింది. దాంతో మిల్లులను అధికారులు నేరుగా తనిఖీచేశారు. బకాయిలు చెల్లించకపోయినా, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోయినా మరి జన్నింగ్ మిల్లు ఎలా పనిచేస్తోందో అర్ధంకాలేదు. ఇదే విషయమై ఒకిటకి రెండుసార్లు తనిఖీలు చేసిన అధికారులకు షాక్ కొట్టిందట.

విషయం ఏమిటంటే జన్నింగ్ మిల్లు కరెంటు బకాయిలు కట్టని కారణంగా కరెంటు కనెక్షన్ తీసేశారు. అందుకనే ఓ 500 మీటర్ల దూరంలోనే ఉన్న స్పిన్నింగ్ మిల్లు నుండి దొంగతనంగా కరెంటు కనెక్షన్ తీసుకుని జిన్నింగ్ మిల్లు కూడా వాడేస్తున్నారు కొమ్మాలపాటి. మామూలుగా ఒకచోట నుండి మరొక చోటికి కరెంటు వైరింగ్ లాగితే బయటపడుతుందని మాజీ ఎంఎల్ఏకి తెలియందు కాదు. అందుకనే రెండు మిల్లుల మధ్యా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసుకుని దొంగతనంగా కరెంటు వైర్లు లాక్కున్నారు.

అప్పట్లో కొమ్మాలపాటి అధికార పార్టీ ఎంఎల్ఏ కాబట్టి అప్పట్లో అధికారులు ఈ విషయాన్ని పసిగట్టినా మాట్లాడకుండా నోరు మూసేసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇపుడు అధికారుల తనిఖీల్లో విషయం బయటపడటంతో స్పిన్నింగ్ మిల్లు కరెంటు కూడా కట్ చేసేశారు.  అంతేకాకుండా రెండు మిల్లుల బకాయిలతో పాటు జరిమానా రూ. 1.69 కోట్లు చెల్లిస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని నోటీసులో తెలిపారు. మొత్తానికి టీడీపీ మాజీ ఎంఎల్ఏ దొంగకరెంటు భాగోతం బయటపడిపోయింది.
Tags:    

Similar News