కేసీఆర్ ఆరోపణలకు కేంద్రమంత్రి ఎంతలా క్లారిటీ ఇచ్చారంటే?

Update: 2020-12-14 05:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయటం తెలిసిందే. దానికి బదులుగా.. సదరు కేంద్రమంత్రిని సీఎం కేసీఆర్ కలిసిన రోజునే పంపటం గమనార్హం. ఇంతకీ అందులో ఏం చెప్పారు? అన్నది ఒక ప్రశ్న. తన లేఖలో కేంద్రం తీరుపై తమ గుర్రును తెలంగాణ ప్రభుత్వం వెల్లడించగా.. అందులో కేంద్రం తప్పు ఏమీ లేదన్న విషయాన్ని వివరిస్తూనే.. రెండు తెలుగు రాష్ట్రాలు చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా వ్యవహరిస్తుందన్న విషయాన్ని వివరించటం గమనార్హం.

తన మాటలకు ఆధారంగా గతంలో సీఎం కేసీఆర్ వివిధ సందర్భాల్లో పేర్కొన్న అంశాల్ని కేంద్రమంత్రి తన లేఖలో కోట్ చేయటం చూస్తే.. తెలంగాణరాష్ట్రం చేసే ఆరోపణల విషయంలో ఆచితూచి అన్నట్లు కాకుండా.. మొహమాటం లేకుండానే రియాక్టు కావాలన్నట్లుగా ఉందని చెప్పాలి. ఇంతకీ.. జల్ శక్తి మంత్రి సీఎం కేసీఆర్ కురాసిన లేఖలో ఆరు కీలక అంశాలు ఉన్నాయి. అవేమన్నది చూస్తే..

1. కృష్ణా, గోదావరి నదులలో నీటి వాటా, వినియోగానికి సంబంధించి మీరు లేవెనెత్తిన పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా అని పేర్కొన్న జల్ శక్తి మంత్రి.. కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీపై..కృష్ణా నదీజలాల వాటా, నీటి వినియోగంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి మీరు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా కోసం మీరు చేసిన ప్రయత్నాలను వివరించారంటూ కేసీఆర్ ప్రస్తావించిన అంశాల్ని పేర్కొన్నారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయటంలో కేంద్రం ఆలసత్వంతో వ్యవహరించిందని మీరు ఆరోపించారు. దీని కారణంగా తెలంగాణకు మేలు జరగటం లేదన్నారు. కానీ.. ట్రైబ్యునల్ ఏరపాటు విషయంలో మీరు 2015లో సుప్రీంను ఆశ్రయించారు. అది ఇంకా పెండింగ్ లో ఉంది. అక్కడ విషయం పరిష్కారం అయితే కేంద్రం నిర్ణయం తీసుకోగలదు.

అక్టోబరు ఆరున జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు సుప్రీంలో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు ఓకే చెప్పారు. మీరు ఉపసంహరించుకునే న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్లగలం.

2. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు.. దాని విస్తరణ గురించి మీరు ప్రస్తావించారు. ఏపీ అనధికార విస్తరణతో తెలంగాణ హక్కులు కోలుకోలేని రీతిలో దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం  2014 ప్రకారం రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లను కేఆర్ఎంబీకి సమర్పించటానికి ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. ప్రాజెక్టు స్వభావం మారినా సమాచారం ఇవ్వాలి. కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ లు పంపేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు పంపారని పేర్కొంటూనే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించి.. కేసీఆర్ మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని సూటిగా చెప్పేశారు.

3. పోతిరెడ్డిపాడు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపటంలో కేఆర్ఎంబీ ఫెయిల్ అయ్యిందని మీరు పేర్కొన్నారు. ఏపీ క్రిష్ణా బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించటాన్నికూడా కేఆర్ఎంబీ ఆపలేకపోయిందని లేఖలో రాశారు.  కానీ.. పోతిరెడ్డిపాడు.. రాయలసీమ ఎత్తిపోతల సహా రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు పంపాలని మేం నిర్ణయించిన సంగతి మీకు తెలిసిందే. టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటుకు ఖర్చు భరించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించారు. దీనిపై పదే పదే అభ్యర్థన చేసినప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించలేదు. రెండు రాష్ట్రాలు  దిశగా వ్యయం భరిస్తేనే టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటు చేయటం సాధ్యమవుతుంది.

4. అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3 పరిధిలో కేంద్రం రెఫర్ చేయనందువల్ల క్రిష్ణా నదీ జలాల్ని పున:పంపిణీ చేసే అంశం పరిశీలించలేమని.. సెక్షన్ 89 పరిధిలో మాత్రమే పరిశీలన జరుగుతుందన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. కేంద్రం స్పందించలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఉపసంహరించుకునే మేం మీ అభ్యర్థనను పరిశీలించేందుకు సిద్ధమని చెప్పగా అపెక్స్ కౌన్సిల్ లో మీరు అంగీకరించారని చెప్పటం ద్వారా.. తమ తప్పేమీ లేదన్న విషయాన్ని కేంద్రమంత్రి స్పష్టం చేశారని చెప్పాలి.

5. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాల్ని మీరు మీ లేఖలో ప్రస్తావించారు. మీరు చేపట్టిన ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవని మీరు ప్రస్తావించారు. ముంపు నష్టం లేకుండా ఉండేందుకు కొన్నిప్రాజెక్టుల స్థలాన్ని మార్చినట్లుగా మీరు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు 2 టీఎంసీలు తోడేందుకు వీలుగా అప్పట్లో డిజైన్ చేస్తే.. మీరు దాన్ని రోజుకు 3 టీఎంసీలకు పెంచుతూ మార్చారు. అలాంటి మార్పు ఏదైనా ఉన్నప్పుడు కేంద్రం నుంచి హైడ్రాలజీ.. అంతర్రాష్ట్ర.. పెట్టుబడులు.. పర్యావరణ తదితర అనుమతులు పొందాల్సి ఉంటుందని మీకు నేను రాశాను.

పరిధి పెంచినప్పుడు ఆ వివరాల్ని కేంద్రానికి ఇవ్వాలి కదా? ఏపీ అభ్యంతరం చెప్పినట్లుగా ఏడు ప్రాజెక్టుల డీపీఆర్ ల మదింపు జరగకుండా ముందుకు వెళ్లొద్దని లేఖలో చెప్పాం. దీనిపై అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కూడా చర్చించాం. అందుకు మీరు సమ్మతించారు. అందువల్ల మీరు కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదన.. సీతారామ ఎత్తిపోతల.. జీఎల్ఐఎస్ ఫేజ్ 3.. తుపాకులగూడెం పరాజెక్టు.. తెలంగాణ తాగునీరు సరఫరా ప్రాజెక్టు.. లోయర్ పెన్ గంగపై బ్యారేజి.. రామప్ప సరస్సునుంచిపాకాల లేక్ కు నీటి మళ్లింపు ప్రాజెక్టులకు జీఆర్ఎంబీ మదింపు జరగనంత వరకు ముందుకు వెళ్లరాదని మరోసారి స్పష్టం చేస్తున్నా.

6. గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు.. ఏపీకి 518.2టీఎంసీలు కేటాయించారని మీరు ప్రస్తావించారు. తెలంగాణకు 1950 టీఎంసీల వాటా దక్కాలని రాశారు. రెండు తెలుగురాష్ట్రాల మధ్య గోదావరి జలాల్ని పంచుకునే విషయంలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు తక్షణం అభ్యర్థన పంపుతామని ఇరు రాష్ట్రాలు అక్టోబరు ఆరున జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అంగీకరించాయి. అభ్యర్థ రాగానే ఆ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 
Tags:    

Similar News