ఈద్ ఉల్ ఫితర్ ఎలా జరుపుకుంటారు? నెలవంకతో సంబంధం ఏంటి?

Update: 2021-05-13 13:57 GMT
ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. ఈ మాసం చివర్లోనే ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకుంటారు. రంజాన్ నెల అంతా ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఉపవాసాలు ముగించడం. కాగా రంజాన్ మాసం చివర్లో నెలవంకను చూడడంతో ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ఇస్లామిక్ క్యాలెండర్ చాంద్రమానం ప్రకారం 12 నెలలు కలిగి ఉంటుంది. వీటిలో తొమ్మిదో మాసానికి అరబిక్ పేరు రంజాన్.

నెలవంకతోనే ప్రతి నెలా మొదలవుతుంది. రంజాన్ పవిత్ర మాసంలో సూర్యోదయానికి ముందు భోజన కార్యక్రమాలు ముగిస్తారు. దీనినే సుహీర్ లేదా సెహ్రీ అంటారు. సూర్యోదయం తర్వాత తిరిగి భోజనం స్వీకరిస్తారు. దీనిని ఇఫ్తార్ లేదా ఫితూర్ అంటారు. రంజాన్ మాసంలోనూ నెలవంకతోనే ఉపవాసాలను ముగిస్తారు. దానధర్మాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. పేదలకు సాయం చేస్తే దైవంతో మమేకం అవుతామని నమ్ముతారు.  ఈ మాసంలో మసీదుల్లో ఉదయం, రాత్రి వేళల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

పండుగ నాడు మసీదుల్లో జరిగే ఈద్ ప్రార్థనల్లో పాల్గొంటారు. మసీదుకు కొత్త బట్టలు ధరించే వెళ్తారు. ఖర్జూరం వంటి తీపి పదార్థాలను సేవిస్తారు. ప్రార్థనలకు ముందు పేదలకు దాన ధర్మాలు చేస్తారు. జకాత్ అల్ ఫితర్ పేరిట తమకు ఉన్న దానిలో దానం చేస్తారు. బంధువులు, స్నేహితుల మధ్యలో ఈ పండుగను జరుపుకుంటారు. రంజాన్ ఇస్లాం ఐదు సూత్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఖురాన్ లోని తొలి సూత్రాలను మహమ్మద్ ప్రవక్త ఈ నెలలోనే బోధించినట్లు ముస్లింలు విశ్వాసం. ఈ మాసంలో ప్రార్థనలు, ఉపవాసాలు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా మేలు చేస్తాయి.

ఉపవాసాలను అందరూ చేయాల్సిన అవసరం లేదు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భణీలు, బాలింతలు, నెలసరి ఉన్నవారు పాటించరు. ఇక ఈ పండుగ వివిధ దేశాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఇండోనేషియా నుంచి మొరాకో వరకు వేర్వేరు భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. మక్కాలో కనిపించిన నెలవంకనే ప్రామాణికంగా భావిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. లాక్డౌన్ లో కొవిడ్ నియమాలను అనుసరించి ఈ పండుగ జరుపుకోవాలి. బంధువులు, స్నేహితుల విందులు ఉండడం కష్టమే. కొన్నిప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు అనుమతి లేదు. ఆన్లైన్ లో నిర్వహించే ఇఫ్తార్ వేడుకలు, ప్రసంగాలకు హాజరు కావచ్చు. గతేడాదితో పోల్చితే ఈ సారి కొన్ని సడలింపులు ఉన్నందున ముస్లింలకు కాస్త ఊరట లభించింది.
Tags:    

Similar News