భార్యకు చెప్పకుండా భర్త అవయవాలు కాజేసిన ఆస్పత్రి

Update: 2020-05-07 15:30 GMT
ఓ నిరుపేద కుటుంబం.. భర్త జబ్బు పడ్డాడు. భార్య విశాఖలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అప్పటికే ఆస్పత్రి బిల్లు రూ.1.70లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ అయిన ఆ పేషంట్ అవయవాలు అమ్మేసుకుంది ఆ ఆస్పత్రి యాజమాన్యం. తన భర్త భౌతిక కాయం నుంచి అవయవాలు కొట్టేసిన ఆస్పత్రిపై నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అతడి భార్య జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఇది ఇప్పుడు సంచలనమైంది. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి.

ఒడిషాలోని గంజాం జిల్లా జాగాపూర్ కు చెందిన కడియాల సహదేవ్ అనే వ్యక్తి 2016 డిసెంబర్ 13న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 19న బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అప్పటికే ఆస్పత్రి బిల్లు బోలెడు అయ్యింది.

బిల్లు చెల్లించాలని సహదేవ్ తల్లిదండ్రులపై ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో సహదేవ్ శరీరం నుంచి రెడు కళ్లు, కాలేయం, మూత్రపిండాలను ‘జీవన్ దాన్’ పథకం కింద దానం చేస్తే ఆస్పత్రి బిల్లును సరిచేస్తామని ఆస్పత్రి ఆఫర్ ఇచ్చింది. మరో దారిలేక ఆ తల్లిదండ్రులు సరేనని అవయవాలన్నీ దానమిచ్చారు. ఆస్పత్రి అవన్నీ తీసేసుకుంది.

అయితే సహదేవ్ జీవిత బీమా సొమ్ము కోసం క్లెయిమ్ చేసిన భార్య షాక్ తిన్నది. డెత్ రిపోర్టులో అవయవాలు లేకపోవడంతో జీవిత బీమా సొమ్ము చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది. దాంతో ఖంగుతిన్న మృతుడి భార్య.. జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బెర్హంపూర్ కోర్టులోనూ ఫిర్యాదు చేసింది.

ఒడిషా పోలీసులు కోర్టు ఆదేశాలతో కూపీలాగారు. సహదేవ్ చనిపోయినప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సదురు కార్పొరేట్ ఆస్పత్రికి ఫేవర్ గా చేశారని తేలింది. దీంతో డీసీపీ రంగారెడ్డి అప్పటి ఎస్ఐకి చార్జి మెమో జారీ చేశారు. పూర్తి నివేదికను జాతీయ మానవహక్కుల సంఘానికి పంపారు.

మొత్తంగా భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కాడ మొదలైన ఈ వివాదం.. అతడి అవయవాలు కొట్టేసినట్టు తేలేదాకా సాగింది. పేదల అసహాయతను ఆసరాగా చేసుకొని అవయవాల కోసం ఆస్పత్రి యాజమాన్యం చేసిన నిర్వాకం బయటపడింది.
Tags:    

Similar News