కేసీఆర్ సర్కారు వారి కరోనా లెక్కలన్ని కాకి లెక్కలేనా?

Update: 2020-12-14 05:12 GMT
సంప్రదాయ మీడియా సంస్థగా పేరున్న ది హిందూ ఇంగ్లిషు దినపత్రికలో ప్రచురితమైన ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా సంచలన వార్తలకు కాస్త దూరంగా ఉంటూ.. తమదైన స్టైల్ లో ఆ పత్రిక నడుస్తుంటుంది. వాణిజ్య పరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తాము రాసుకున్న రూల్ బుక్ కు పక్కకు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే సదరు పత్రిక తాజాగా ప్రచురించిన కథనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారిందన్న మాట వినిపిస్తోంది.

కరోనా లెక్కలపై మొదట్నించి చాలానే విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై హిందూ తాను పరిశోధించగా కొత్త విషయాలు వెల్లడయ్యాయని పేర్కొంది. తెలంగాణలో కరోనాపాజటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు నెల రోజుల పాటు జరిపిన పరిశోధనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్న పరీక్షలకు సంబంధించిన పేర్లు.. ఫోన్లు.. అడ్రస్ లలో చాలావరకు తప్పేనని వెల్లడించింది.

సెప్టెంబరు నుంచి డిసెంబరుమధ్యలో 352 పాజిటివ్ కేసుల్ని తీసుకొని పరిశీలించగా.. అందులో 110 కేసుల్లో అనుమానాస్పద సమాచారం ఉన్నట్లుగా పేర్కొంది. కొందరు సిబ్బంది తమ టార్గెట్ ను పూర్తి చేయటం కోసం.. తప్పుడు చిరునామాలు.. ఫోన్ నెంబర్లు నమోదు చేసి నెగిటివ్ వచ్చినట్లుగా పేర్కొంటున్నట్లుగా వెల్లడించారు.

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకలు సంబంధించి తెలంగాణ ఆరోగ్య విభాగం వారు డిసైడ్ చేసిన ప్రోటోకాల్ మంచిదే. కాకుంటే వైరస్ సోకిందన్న సందేహం ఉన్న వారు టెస్టు చేయటానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబరు.. చిరునామా.. పేరు చెప్పాలి. ఆ వివరాల్ని నమోదు చేసి.. సదరు ఫోన్ నెంబరుకు ఓటీపీ పంపుతారు. అనంతరం ఆ వ్యక్తికి ప్రత్యేక ఐడీని తెరుస్తారు. ఈ డేటా అంతా సర్వర్ లోకి అప్ లోడ్ అవుతుంది. పీహెచ్ సీల్లో రోజుకు 60 పరీక్షలు.. ఏరియా ఆసుపత్రుల్లో 200 పరీక్షలు చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టటంతో.. అంతమంది అనుమానితులు రాకపోవటంతో.. షార్ట్ కట్ పద్దతిని పాటిస్తున్నారు. దీంతో.. వ్యవహారం మొదటికే మోసం వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ కాకి లెక్కల మాటకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News